విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా.యన్టీఆర్ నటించిన సినిమాల్లో చాలా ప్రత్యేకమైనది ‘భలేతమ్ముడు’. ఆయన ద్విపాత్రాభినయం చేసిన సినిమాల్లోకెల్లా ఇది చాలా వైవిధ్యమైన కథాకథనాలతో రూపొందింది. తారకరామా పిక్చర్స్ బ్యానర్ పై అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు బి.ఏ.సుబ్బారావు. 1969, నవంబర్ 18న విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది.

చిన్నతనంలోనే విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములలో ఒకరు దొంగాగానూ, మరొకరు గాయకుడిగానూ మారతారు. పోలీసులు దొంగను బంధించి అతడి స్థావరంలో గాయకుడ్ని పంపించి దుర్మార్గుల ఆటకట్టించడమేసినిమా కథ. కె.ఆర్.విజయ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. రేలంగి, రాజనాల, ప్రభాకరరెడ్డి, మిక్కిలినేని, జూనియర్ శ్రీరంజని, రమాప్రభ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. టీ.వి.రాజు సంగీత సారధ్యంలోని అన్ని పాటలూ ఎంతో జనాదరణ పొందగా.. బాలీవుడ్ గాయకుడు మహమ్మద్ రఫీ గొంతు నుంచి జాలువారిన ‘ఎంతవారు గాని, గోపాల బాల, నేడే ఈనాడే, ఇద్దరి మనసులు ఒకటాయే’ అనే పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. నిజానికి ఈ సినిమా ‘చైనాటౌన్’ బాలీవుడ్ చిత్రానికి రీమేక్ వెర్షన్. షమ్మీ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్టైంది. ఆ తర్వాత సరిగ్గా ఇదే స్టోరీ లైన్ తో  అమితాబ్ డాన్ సినిమా రూపొందగా.. అది కూడా సూపర్ హిట్టవడం విశేషం. అంతేకాదు .. ఆ సినిమా తెలుగు వెర్షన్ ‘యుగంధర్’  లో కూడా యన్టీఆరే కథానాయకుడిగా నటించడం మరీ విశేషం.  

 

Leave a comment

error: Content is protected !!