దర్శకుడు బాపు ప్రత్యేకించి పిల్లలకోసం తెరకెక్కించిన అపురూప చిత్రం ‘బాలరాజు కథ’. లక్ష్మి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై నిడమర్తి పద్మాక్షి నిర్మించిన ఈ సినిమా 1970 లో విడుదలైంది. బాలరాజు గా మాస్టర్ ప్రభాకర్ నటించగా.. నాగభూషణం, సూర్యాకాంతం, ధూళిపాళ, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, బేబీ సుమతి, సాక్షిరంగారావు, హేమలత, రావికొండలరావు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ముళ్ళపూడి వెంకటరమణ సంభాషణలు అందించగా.. ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకుంది.
చారిత్రక స్థలమైన మహాబలిపురంలో బాలరాజు అనే కుర్రోడు కుటుంబ పోషణ కోసం గైడ్ గా పనిచేస్తుంటాడు. అతడి చురుకుదనానికి ముచ్చటపడ్డ దంపతులు బాలరాజు ను దత్తత తీసుకోవాలనుకుంటారు. అప్పుడు చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు ఈ సినిమా కథను అనూహ్యమైన మలుపుతిప్పుతాయి. నిజానికి ఈ సినిమా 1969లో విడుదలైన తమిళ సినిమా ‘వా రాజా వా’ సినిమాకి రీమేక్ వెర్షన్. అక్కడలాగానే తెలుగులో కూడా సినిమా ఘనవిజయం సాధించింది. కె.వి.మహాదేవన్ సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా మహాబలిపురం.. మహాబలిపురం, అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయొద్దు, ఒకటి రెండు మూడైతే పాటలు సంగీత ప్రియుల్ని మెప్పిస్తాయి.