నిన్న ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త మరువక ముందే బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. కపూర్ ఫ్యామిలీలో లవర్ బాయ్ గా చెప్పుకునే రిషీ కపూర్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. రాత్రి సమయంలో ఆయన్ను ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతున్న రిషి కపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం గతేడాది సెప్టెంబర్లో ఆయన భారత్కు వచ్చారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఫ్యామిలీ ఫంక్షన్కు హాజరైన సమయంలో అస్వస్థతకు లోనుకావడంతో అక్కడే హాస్పిటల్లో చేర్పించారు. ఆ సమయంలో తాను ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టుగా రిషి కపూర్ వెల్లడించారు.
కొంత కాలంగా చికిత్స తీసుకున్న బారినపడిన రిషి కపూర్ ఆ తర్వాత కోలుకున్నారు. లాక్డౌన్ సందర్భంగా రిషికపూర్ యోగా చేస్తున్న ఫొటోను ఇటీవల ఆయన భార్య నీతూకపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా నేడు ఆయన ముంబాయి ఆసుపత్రిలో కన్నుమూశారు. నిన్న ఇర్ఫాన్ ఖాన్.. నేడు రిషీ కపూర్ కన్ను మూయడంతో బాలీవుడ్ ఒక్కసారే శోక సంద్రంలో మునిగిపోయింది. రిషీ కపూర్ మృతికి పలువురు బాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.