ఆయన గొంతు కంచులా ఠంగున మోగుతుంది. పాట నిప్పుకణమై ఎగసిపడుతుంది. ఎంతో భావోద్వేగంతో ఉరకలేసే  ఆయన గీతం మూడు దశాబ్దాలుగా  తెలుగు వారిని ఎంతగానో అలరిస్తోంది. పేరు వందేమాతరం శ్రీనివాస్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. సినిమాలకే కాకుండా టీవీ సీరియళ్ళకు కూడా నేపథ్య సంగీతం అందించారు. 9 నంది అవార్డులు, 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు మద్రాసు కళాసాగర్ అవార్డు, సాలూరి రాజేశ్వర రావు, ఎం. ఎస్. విశ్వనాథన్ స్మారక పురస్కారాలు అందుకున్నారు.

టి. కృష్ణ వందేమాతరం సినిమాలో వందేమాతర గీతం వరుసమారుతున్నది అనే పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యారు శ్రీనివాస్. ఈ పాటతో ఆయన పేరులో వందేమాతరం వచ్చి చేరింది. ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్.నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చారు. ఆయన సినిమాలకే అత్యధికంగా సంగీతాన్ని అందించి, పలు గీతాలు రాయడం, పాడటం చేసారు. ‘అమ్ములు’ అనే చిత్రంలో హీరో గా నటించారు. ‘బద్మాష్’ అనే సినిమాకి దర్వకత్వం వహించారు.  విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్, దేవుళ్ళు చిత్రంలో భక్తి పరమైన గీతాలను సృష్టించి ఆ చిత్రాన్ని విజయవంతం చెయడంలో ముఖ్య భూమిక పోషించారు. ఆ తర్వాత ఎన్నో కమర్షియల్ చిత్రాలకు సైతం సక్సెస్ ఫుల్ ట్యూన్స్ అందించారు. నేడు వందేమాతరం శ్రీనివాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!