నట సామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు నటించిన కుటుంబ కథా చిత్రాల్లో  అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రం ‘పెళ్ళికానుక’. సి.వి. శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో బి.సరోజాదేవి, కృష్ణకుమారి కథానాయికలు గా నటించారు. ఇంకా జగ్గయ్య, గుమ్మడి, రేలంగి, గిరిజ, కె.మాలతి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 1960 లో విడుదలైన ఈ సినిమాకి ఏ.యమ్.రాజా సంగీతం అందించారు.   ఆడే పాడే పసివాడ, కన్నులతో పలకరించు, పులకించని మది పులకించు లాంటి పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి.

భాస్కర్ , వాసంతి కాలేజ్ లో చదువుకున్నప్పటి నుంచి ప్రేమించుకుంటారు. వాసంతి అక్క గీత.. మిషన్ కుట్టి వాళ్ళింటిని పోషిస్తూంటుంది. భాస్కర్ వాళ్ళ మేడమీద గది లోకి  అద్దెకు దిగుతాడు. ఒకసారి భాస్కర్ కి జ్వరం వస్తే గీత సేవ చేస్తుంది. ఆ క్రమంలో గీత భాస్కర్ తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం చెల్లెలు వాసంతికి చెబుతుంది. అక్క సంతోషం కోసం భాస్కర్ ని గీతను పెళ్ళిచేసుకోమని కోరుతుంది వాసంతి. భాస్కర్ ఆమెను పెళ్ళి చేసుకుంటుంది. కానీ ఆమెను పట్టించుకోడు. అది గమనించిన వాసంతి.. గీతను సంతోష పెట్టమని అర్ధిస్తుంది. ఆమె కోరిక మేరకు భాస్కర్ గీతతో అన్యోన్యంగా ఉంటాడు. వారికో బిడ్డ పుడతాడు. అయితే భాస్కర్ కి, వాసంతికి మధ్య ఏదో ఉందని అనుమానించిన గీత.. వాసంతిని ఇంటి నుంచి గెంటేస్తుంది. ఆ తర్వాత నిజం తెలుసుకొని పశ్చాత్తపంతో చనిపోతూ.. వాసంతిని పెళ్లిచేసుకొని బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కన్నుమూస్తుంది. ఇంతలో వాసంతి తన బాస్ ను పెళ్లిచేసుకుంటుంది. భాస్కర్ తన బిడ్డను తమ పెళ్లి కానుకగా వాసంతికి అప్పగిస్తాడు. ఇదే సినిమాను ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రదతో ‘దేవత’ గా తెరకెక్కించి విజయం సాధించారు.  నిజానికి పెళ్ళికానుక  సినిమా తమిళంలో శ్రీధర్ తెరకెక్కించిన ‘కళ్యాణ పరిసు’ సినిమాకి రీమేక్ వెర్షన్ . జెమినీ గణేశన్ హీరోగా నటించిన ఈ సినిమాకూడా తమిళంలో సూపర్ హిట్టయింది.

Leave a comment

error: Content is protected !!