చరిత్ర సృష్టించిన ప్రతీ సినిమా పుట్టుక వెనుకా.. ఓ ప్రత్యేక చరిత్ర ఉంటుంది. ఏదో ఒక సంఘటన నుంచి దర్శకుడు స్ఫూర్తి పొందొచ్చు… లేదా చూసిన సినిమా, చదివిన కథ .. ఇలా ఏదైనా కావచ్చు. అది సినిమా గా రూపాంతరం చెంది ప్రేక్షకుల మనసు గెలుచుకుని, ఒక చరిత్ర గా మిగిలిపోతే… ఆ దర్శకుడంతటి అదృష్ణ వంతుడే ఉండడు. అలాంటి అదృష్టం వైవిధ్య చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకి దక్కింది. ఆ సినిమా పేరు పుష్పకవిమానం. టాకీ యుగంలో మూకీ సినిమా చేయడానికి ఆ దర్శకుడికి ఎన్ని గట్స్ కావాలి? అందులో కథానాయకుడు కమల్ హాసన్ కాబట్టి సాధ్యమైందని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ పుష్పక విమానం సినిమా ఆలోచన ఎలా పుట్టిందో తెలుసా?

అప్పట్లో సింగీతం, కె.వి.రెడ్డితో కలిసి పనిచేసేటప్పుడు ఓ జానపద చిత్రంలో పింగళి నాగేంద్రరావు ‘మిత్రమా. ఇక్కడంతా చీకటి, నాకెందుకో భయంగా ఉంది’ అనే డైలాగ్‌ రాశారట. దీంతో కె.వి.రెడ్డి నాగేంద్రరావుని రమ్మని చెప్పి ‘ఏంటండీ! రాత్రి వేళ చీకటిగా ఉంటుంది. భయంలేకుండా ఎలా ఉంటుంది? ఆ విషయం డైలాగ్‌లా రాయాలా?’ అన్నారట. ‘అయ్యా! మీరెలాంటి నటుల్ని ఎంపిక చేస్తారో, ఏ కెమెరామెన్‌ను తీసుకుంటారో తెలీదు కదా. అందుకే ఆ డైలాగ్‌ రాయాల్సివచ్చిందన్నా’రట పింగళి నవ్వుతూ. ఆ సంఘటనే నన్ను ‘పుష్పక విమానం’ తీసేందుకు స్ఫూర్తినిచ్చిందని సింగీతం ఓ సందర్భంలో తెలిపారు. అలా కె.వి.రెడ్డి, పింగళి మాటలతో మాటల్లేని ‘పుష్పక విమానం’ ప్రేక్షకులకు కానుకగా ఇచ్చారు సింగీతం. ఈ టైటిల్‌ ఎందుకు పెట్టారంటే? ఊహల్లో విహరించే ఓ యువకుడి కథ ఇది. మరోవైపు పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా మరొకరి ఎక్కేందుకు అవకాశం ఉంటుంది. ఇలా ఊహాలు కూడా ఒకటి మించి మరొకటి వస్తుంటాయి. అందుకే ఈ కథకు ‘పుష్పక విమానం’ సరిపోతుందని భావించారట.

Leave a comment

error: Content is protected !!