దర్శకుడి మనసు చదివే రచయితలు చాలా అరుదుగా ఉంటారు. ఇద్దరూ పాలు నీళ్ళలా కలిసిపోయి.. పనిచేస్తే ఏ సినిమా అయినా.. ప్రేక్షకాదరణ పొందుతుందని గణేశ్ పాత్రో లాంటి ప్రతిభవంతమైన రచయితల్ని చూసినప్పుడు అనిపిస్తుంది. తమిళ దర్శకుడు కే.బాలచందర్ తో ఆయన కలిసి ప్రయాణం చేసిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించి .. చరిత్రలో నిలిచిపోయాయి. అలాంటి ప్రతిభాశాలి మనవాడు అవడం నిజంగా మన అదృష్టం.

1970లో తన సినీ కెరీర్ ప్రారంభించిన గణేశ్ పాత్రో.. అయిదేళ్ళ కాలంలో ప్రథమ శ్రేణి నాటకకర్తగా పేరు తెచ్చుకున్నాడు. రచనలు చాలా తక్కువే అయినా, వ్రాసిన ప్రతి నాటికా, నాటకము రంగస్థలం మీద రక్తి కట్టి రసజ్ఞుల మెప్పుపొందింది. కథా వస్తువును పరిగ్రహించడంలో, కథనంలో, పాత్రచిత్రణలో, సన్నివేశాల మేళవింపులో, మాటల కూర్పులో నిత్య నూతన పరిమళాన్ని వెదజల్లిన ప్రతిభాశాలి గణేష్ పాత్రో. సంఘటనల ద్వారా సమస్యను శక్తివంతంగా ఆవిష్కరించటం ఈయన రచనా విధానంలో ప్రత్యేకత.  1970 నుండి 1990ల వరకు అనేక సినిమాలకు సంభాషణలు, కథను అందించాడు. పదిహేనేళ్ళ తర్వాత తిరిగి సినీరంగానికొచ్చి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంభాషణలు సమకూర్చాడు.  ఈయన సినీ సంభాషణలు సమకూర్చిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నిర్ణయం, సీతారామయ్య గారి మనవరాలు, రుద్రవీణ, తలంబ్రాలు, ప్రేమించు పెళ్ళాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మాపల్లెలో గోపాలుడు ఇలా పలు హిట్ చిత్రాలు ఉన్నాయి.  బాలచందర్ తో పాటు సింగీతం శ్రీనివాసరావు, క్రాంతికుమార్, వంశీ, కోడిరామకృష్ణ తో పాటు .. నేటి తరం దర్శకుడైన శ్రీకాంత్ అడ్డాల (సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ) లాంటి దర్శకులతో కూడా పనిచేసి .. సత్తా చాటుకున్నారు. కేవలం సంభాషణలు మాత్రమే కాకుండా నాగార్జున ‘నిర్ణయం‘ చిత్రంలో ‘హలో గురూ ప్రేమకోసమేరోయ్ జీవితం’ పాటనూ రాసి .. తన కలానికి రెండు వైపులా పదునే అని నిరూపించారు.  నేడు గణేశ్ పాత్రో  వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!