యన్టీఆర్ ఆఖరుగా దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘సామ్రాట్ అశోక్’ ఒకటి. అశోకచక్రవర్తి జీవిత కథను చారిత్రక నేపథ్యంతో యన్టీఆరే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో భానుమతి ఓ ముఖ్యపాత్రలో నటిస్తే.. వాణీ విశ్వనాథ్ ఆయన సరసన కథానాయికగా నటించింది. మోహన్ బాబు, గుమ్మడి, సత్యనారాయణ లాంటి నటులు .. ఇందులో అతి ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే. ఇందులో అక్కడక్కడ వచ్చే పాత్రల్ని ధరించిన వాళ్లే.. మళ్లీ మళ్లీ వేరే వేరే పాత్రలు ధరించారు. అంటే ఒక పదిమంది ఉపనటుల్ని తీసుకొని వాళ్ల చేతనే 50, 60 పాత్రలు ధరింపజేశారు యన్టీఆర్. అందుకే చాలామందిని గుర్తుపట్టవచ్చు. అలాగే ‘విశ్వామిత్ర’లో కూడా విశ్వామిత్రుడి శిష్యులుగా వేసిన వాళ్లే, హరిశ్చంద్రుడి పరివారంలోనూ కనిపిస్తారు. చాలా కాలంగా తండ్రి పాత్రల్లో రాణిస్తున్న చలపతిరావు ‘దానవీర శూరకర్ణ’లో ఐదు పాత్రల్లో కనిపిస్తాడు. అయితే అప్పుడు చలపతిరావు తెలియదు గనక అప్పట్లో గుర్తుపట్టలేకపోయారు . కానీ ఇప్పుడు చూస్తే గుర్తు పడతాం.