దక్షిణాది సినీ వినీలాకాశంలో ఒక అందాల తార ఉదయించడానికి బీజం వేసిన చిత్రం ‘పదినారు వయదినిలే’. తన చిత్రాలతో భారతీయ సినిమాకే వన్నె తెచ్చిన భారతిరాజా తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా అది. అనూహ్యమైన విజయం సాధించింది చిత్రం. కథానాయికగా నటించిన శ్రీదేవికి తమిళనాట బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. ఆ సినిమా రీమేక్ రైట్స్ ను రాజ్యలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత మిద్దేరామారావు తీసుకున్నారు. దర్శకుడిగా రాఘవేంద్రరావు అయితేనే దీనికి న్యాయం చేస్తాడని నిర్మాతలు భావించారు. అప్పటికే ఆయన అడవి రాముడు విజయంతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. రీమేక్ ని ఒప్పుకుంటాడా లేదా అన్న సందేహంతో నిర్మాతలు ఆయన్ను సంప్రదించారు. అప్పటికీ తమిళ చిత్రం చూసిన ఆయన సినిమా పై ఆసక్తి చూపించి చేశారు. శ్రీదేవినే నాయికగా తీసుకున్నారు. ఆమె 50,000 రూపాయలు పారితోషికం అడిగితే 35,000 రూపాయలు ఇచ్చారు నిర్మాతలు. చంద్రమోహన్ కి 17,000 మోహన్ బాబుకి 10,000 రూపాయలు ఇచ్చారు. సంగీత దర్శకుడు చక్రవర్తి మాతృక నుంచి ఒక్క బాణీనే తీసుకున్నాడు. అదే సిరిమల్లె పువ్వా అనే పాట. దీనిని జానకి గానం చేశారు. అప్పట్లో ఈ పాట అత్యంత ప్రజాదరణ పొందింది. చిత్రం ప్రారంభం కాకమునుపే ఈ సినిమా వైపు పలువురు ఆసక్తి చూపించారు. తమిళ చిత్రం చూసి కమల్ చేసిన పాత్రపై శోభన్ బాబు కూడా మోజు పెంచుకున్నారు. అయితే గోచీ పెట్టుకుని, డీ గ్లామరస్ గా శోభన్ బాబు కనిపిస్తే బాగుండదని సినీ ప్రముఖులు చెప్పడంతో వెనక్కి తగ్గారు. అలాగే రజనీకాంత్ తెలుగులోనూ తానే నటించేందుకు ముందుకొచ్చారు. అయితే దర్శక నిర్మాతలు మాత్రం మోహన్ బాబును తీసుకున్నారు. ఈ సినిమా చేసే సమయానికి శ్రీదేవి వయసు 15 సంవత్సరాలు.