ప్రఖ్యాతి గాంచిన కెమేరా మెన్ లో చాలా మంది.. ఆర్టిస్ట్ లు ముఖానికి మేకప్ వేసుకోడానికి ఇష్టపడరు. వారిచ్చే ముఖ్యమైన ఎక్స్ ప్రెషన్స్ కి మేకప్ భంగం కలిగిస్తుందని వారి ఉద్దేశం. అలాంటి వారి లిస్ట్ లో ముందు వరుసలో ఉండే వ్యక్తి ఇషాన్ ఆర్య అయితే.. ఆయన తర్వాత చెప్పుకో దగ్గ కెమేరా మేన్ బాలూ మహేంద్ర. . సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన పంతులమ్మ సినిమాకి కెమేరా మేన్ ఆయనే. ఇందులో రంగనాథ్, లక్ష్మి జంటగా నటించారు.
పంతులమ్మ సినిమాలో ఎవరి ముఖానికీ మేకప్ లేకపోవడం ఆశ్చర్యం అనిపించక మానదు. ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన రావికొండలరావు .. మొదటిరోజు షూటింగ్నాడు బాలుమహేంద్ర దగ్గరకెళ్లి ‘‘నా ముఖం ఇలా నల్లగా ఉంటుంది. కొద్దిగానైనా పాన్కేక్ వేసుకోవద్దంటారా?’’ అని అడిగారట. ‘‘వద్దు… నేను మీకు స్టిల్ తీసి చూపిస్తాను చూడండి’’ అని తన కెమెరాలో ఫోటో తీశారట. మర్నాడే ఆ ఫొటో రావికొండలరావుకి ఇచ్చారట బాలు మహేంద్ర . మేకప్ లేకపోయినా ముఖం తేజోవంతంగా కనిపించి, తెల్లబోయి ఆయన్ని చూశాడట. ‘‘ముఖం రంగుతో కప్పేస్తే ముఖం మీద ఆ టెక్చర్ కనిపించదు. ఇప్పుడు చూశారా, మీ ఎక్స్ప్రెషన్స్ కూడా కచ్చితంగా క్లోజప్తో కనిపిస్తాయి’’ అన్నారట ఆయన . ఆశ్చర్యంగా చూశారట రావికొండలరావు . ‘‘ఏమీ లేదు. మీరు సబ్బుతో ముఖం కడుక్కుని వచ్చేయండి, నేను చూసుకుంటాను’’ అన్నారట బాలూ . ఆ సినిమాలో ఎవరికీ మేకప్‌లు లేవు. కానీ, ఉన్నట్టే అనిపిస్తాయి. అదే బాలు మహేంద్ర ప్రజ్ఞ అని రావికొండలరావు ఒక పుస్తకంలో రాసుకున్నారు.