గులాబీ చిత్రంతో హీరోగా ప్రమోట్ అయిన జెడీ చక్రవర్తి .. నైంటీస్ లో హీరోగా ఓ రేంజ్ లో పాపులరయ్యాడు. అప్పట్లో జెడీ టాలీవుడ్ లో ఓ క్రేజీ హీరో. ఆ క్రమంలోనే వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘నేను ప్రేమిస్తున్నాను’. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో 1998లో విడులైన ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఆదరించారు. రచన కథానాయికగా నటించిన ఈ సినిమా లో ఇంకా శరత్ బాబు, శ్రీవిద్య, బ్రహ్మానందం, బెనర్జీ, బసంత్ రవి, కైకాల సత్యనారాయణ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. పెద్దల్ని ఎదిరించి తమ ప్రేమను గెలిపించుకున్న ఇద్దరు ప్రేమికుల కథ గా ఈ సినిమా తెరకెక్కింది.సిర్పి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. నిజానికి ఇది మలయాళంలో సూపర్ హిట్టైన ‘అనియత్తి ప్రావు’ సినిమాకి రీమేక్ వెర్షన్. కుంచాకో బోబన్, షాలినీ జంటగా నిటించిన ఈ సినిమా మాలీవుడ్ యూత్ ను ఓ రేంజ్ లో అలరించింది. ఇదే సినిమాను తమిళంలో ప్రియదర్శన్ ‘కాదలిక్కు మరియాదై’ (దళపతి విజయ్, షాలిని) గా రీమేక్ చేయగా.. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్టైంది. ఆ తర్వాత ఇదే సినిమా హిందీలో ‘డోలీ సజాకె రఖనా’ (అక్షయ్ ఖన్నా, జ్యోతిక ) గానూ, కన్నడలో ‘ప్రీతిగాగి’ (శ్రీమురళి, శ్రీదేవి ) గానూ రీమేక్ అయి సూపర్ హిట్టయ్యాయి.