‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ్ అశ్విన్ .. తొలి ప్రయత్నంలోనే మంచి విజయం నమోదు చేసుకున్నాడు. ఆ తర్వాత ‘మహానటి’ తో సావిత్రమ్మ జీవితకథను అత్యంత సహజంగా తెరకెక్కించి నేషనల్ అవార్డ్ ను సైతం కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ దర్శకుడి తదుపరి చిత్రం మీదే అందరి దృష్టి. ఈ సారి మనోడు ఏ జోనర్ లో సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దాదాపు రెండేళ్ళ గ్యాప్ తర్వాత ఆయన చేయబోతున్న సినిమాలో హీరో ఎవరై ఉంటారనే ఆత్రుతా ఉంది.
ఆ మధ్య నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తాడనే రూమర్స్ వచ్చాయి. ఆయన కోసం ఓ వైవిధ్యమైన కథకూడా రెడీ చేస్తున్నాడని కూడా అన్నారు. కానీ ఆ తర్వాత ఆ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఆ ఆలోచనను పక్కనపెట్టి.. ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్నాడట. దానికి బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తాడట. హీరోగా నానీ, శర్వానంద్, విజయ్ దేవరకొండ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వారిలో ఒకరు ఈ సినిమాకి హీరోగా ఫిక్స్ చేసే అవకాశాలున్నాయి. ఆ హీరో ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఎవరి డేట్లు అందుబాటులో ఉన్నాయో చూసుకుని, వాళ్లతో సినిమా ప్రకటించే అవకాశాలున్నాయి. ఏప్రిల్ ,మేల లో నాగ అశ్విన్ సినిమా పట్టాలెక్కనుందని టాక్.