దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. నూటొక్కజిల్లాలకు అందగాడ్ని, ఒరినా దేవుడో దేవుడా, లాంటి మ్యానరిజమ్స్ తో .. తనకు మాత్రమే సాధ్యమయ్యే డిక్షన్ తో .. నవ్వులు పూయించే డైలాగుల విరుపులతో .. పెక్యులర్ బాడీ లాంగ్వేజ్ తో చెలరేగే నటుడు ఆయన. పేరు తడినాధ వరప్రసాద్. దర్శకుడు బాపు ఆయనకి నూతన్ ప్రసాద్ అని నామకరణం చేశారు. అప్పటినుంచి తెలుగువారికి తన నటనతో నవ్వించి , ఏడిపించి, తిట్టుకొనేలా చేసి, అయ్యో అనుకొనేలా మనసు మార్చి .. వెండితెరమీద నిత్యనూతన ప్రసాద్ అనిపించుకున్నారు. అసలు ఆయన తెలుగు తెరపై అంతటి స్థాయిలో గుర్తింపు పొందడానికి ఆయన హార్డ్ వర్కే కారణం.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘అందాల రాముడు’ చిత్రంతో చిత్ర రంగ ప్రవేశం చేశారు నూతన్ ప్రసాద్ . ఆ తర్వాత ‘నీడలేని ఆడది’లో నటించారు. కానీ ఈయనకి మంచి గుర్తింపు అంటే ‘ముత్యాల ముగ్గు’లో రావు గోపాలరావుతో కలిసి నటించిన ప్రతినాయక పాత్రతోనే లభించింది. ఆ తర్వాత వరుసగా ఆ తరహా పాత్రలే లభించాయి. తనదైన శైలిలో సంభాషణల్ని పలకడం, ప్రతినాయక పాత్రలకి హాస్యంతో వన్నె అద్దం ఆయన ప్రత్యేకత. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి తదితర అగ్ర కథానాయకుల సరసన నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రంలో కథానాయకుడిగా కూడా నటించారు. 1970, 80వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కీలక నటుడుగా ఎదిగారు. ‘రాజాధిరాజు’ చిత్రంలో సైతాన్‌గా ఆయన నటన ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. సుందరి సుబ్బారావు చిత్రంలో నటనకిగానూ నంది పురస్కారం లభించింది. 2005లో ఎన్టీఆర్ పుస్కారం అందుకొన్నారు. ‘బామ్మ మాట బంగారు మాట’ చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన కొంతకాలం సినిమా రంగానికి దూరమయ్యారు. ఆ తర్వాత కోలుకొని కాళ్లు సహకరించకపోయినా పలు చిత్రాల్లో నటించారు. 365కిపైగా సినిమాల్లోనే నటించి మెప్పించిన నూతన్ ప్రసాద్.. . ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ నిత్యనూతనంగా ఉన్నారు. నేడు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.