నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన కామెడీ సినిమాలన్నీ అప్పట్లో ఆల్మోస్ట్ హిట్సే. అలాంటి సినిమాల్లో ‘నాకూపెళ్ళాం కావాలి’ ఒకటి. చంద్రమోహన్ మరో హీరోగా నటించిన ఈ సినిమా శ్రీనాథ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జె.మురళీ మోహన్ నిర్మాణంలో విజయబాపినీడు దర్వకత్వంలో తెరకెక్కింది. కల్పన, శాంతిప్రియ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో ఇంకా నూతన్ ప్రసాద్, నిర్మలమ్మ, రమణారెడ్డి, కోటశంకర రావు, చిట్టిబాబు, సత్తిబాబు, తాతినేని రాజేశ్వరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఇందులో రాజేంద్ర ప్రసాద్ కి .. క అనే అక్షరం పలకదు. దాన్ని త గా పలుకుతాడు. ఆ తమాషానే బోలెడంత కామెడీ పండిస్తుంది. అలాగే ఇందులో నూతన్ ప్రసాద్ కామెడీ కూడా అద్భుతాలు చేసింది.  అప్పట్లో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. అలాగే.. ఈ సినిమాతో మాటల రచయిత భువన చంద్ర, కోట శంకరరావు, కల్పన, శాంతి ప్రియలు  టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.

రామలక్ష్మణులు (చంద్ర మోహన్, రాజేంద్ర ప్రసాద్) .. టూరింగ్ టాకీస్  యజమాని బుల్లెబ్బాయి (నూతన్ ప్రసాద్) కొడుకులు. రాముడు తన తండ్రి ఏర్పాటు చేసిన పెళ్ళిచూపుల్లో అమ్మాయిని చూడటానికి వెళ్లి .. పొరపాటుగా వేరే ఇంటికి వెళ్ళి, వేరే అమ్మాయి సీతను (కల్పన) చూస్తాడు. ఆ ఇంట్లో వారు కూడా కూతురు  పెళ్ళిచూపుల కోసం వచ్చే కుర్రవాడి కోసం చూస్తున్నారు. అతను సీతను ఇష్టపడతాడు. ఆమెను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సీత కూడా అతడిని ఇష్టపడి ఈ పెళ్ళికి అంగీకరించాలని నిర్ణయించుకుంటుంది. ఇంతలో, సీత పెళ్ళిళ్ళ  బ్రోకర్ వచ్చి, చూపులకు వచ్చినది వేరే పెళ్ళికొడుకని చెబుతాడు. ఇది విన్న రాముడు, సీతతో పాటు సీత తల్లిదండ్రులు కూడా నిరాశ చెందుతారు. బుల్లెబ్బాయి తండ్రి మాత్రం రాముడి  పెళ్ళి తాను చూసిన రేఖ (శాంతిప్రియ) తోనే  అంటే..  టీచర్ విశ్వనాథం (రమణ మూర్తి)  కూతురికి  చేసేందుకు ఏర్పాట్లు చేస్తూంటాడు. సీతను పెళ్ళి చేసుకోవాలని రాముడి సంకల్పం ఒక వింత సంఘటనకు కారణమవుతుంది. చివరగా, లక్ష్మణుడు రేఖను పెళ్ళి చేసుకోగా, రాముడిని  తన సీతకే  ముడి వేస్తారు. కథ సుఖాంతమవుతుంది.

నిజానికి ఈ సినిమా తమిళ సినిమా ‘ఆన్ పావం’ కి రీమేక్ వెర్షన్. పాండ్యరాజన్, పాండ్యన్ హీరోలుగా నటించిన ఆ సినిమాకి దర్శకుడు పాండ్యరాజన్.  ఇదే సినిమా కన్నడలో రామకృష్ణ గా  రీమేక్ అయింది. 

 

Leave a comment

error: Content is protected !!