చూడగానే నవ్వుతెప్పించే రూపం.. నవ్వితే హాస్యం మొలకెత్తించే ముఖం.. మాటలతోనూ, చూపులతోనూ .. చేతలతోనూ నవ్వించి నవ్వించి పొట్టచెక్కలు చేసే పెర్సనాలిటీ. లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ లో వైవిధ్యాన్ని ప్రదర్శించే వ్యక్తి. పేరు సుత్తి వేలు. అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. జంధ్యాల స్కూల్ నుంచి వచ్చిన నవ్వుల గుత్తి ఆయన. వీరభద్రరావు తో హాస్యాన్ని చిలికించి సుత్తి జంటగా ప్రసిధ్ధికెక్కారు.
మచిలీపట్నం సమీపంలో భోగిరెడ్డి పల్లిలో జన్మించారు సుత్తివేలు. చిన్నప్పుడు సన్నగా ఉండేవారు. దాంతో ఆయన పిన్ని జానకాంబ ‘వేలు’ అని పిలిచేవారు. నటుడు అయ్యాక ‘నాలుగు స్తంభాలాట’లో సుత్తి అనే పాత్రని పోషించారు. అప్పట్నుంచి ఆయన పేరు సుత్తివేలు అయ్యింది. 200 పైచిలుకు చిత్రాలతో పాటు, టెలివిజన్ ధారావాహికల్లో నటించిన సుత్తివేలు నాలుగు నంది పురస్కారాలు సొంతం చేసుకొన్నారు. చిన్నప్పట్నుంచి నాటకాలపై మక్కువ పెంచుకొన్న ఆయన స్నేహితులతో కలిసి నాటకాల్లో అభినయించేవారు. ‘మనిషి నూతిలో పడితే’ అనే నాటకంలో ఆయన పాత్రని చూసిన జంధ్యాల, ‘ముద్దమందారం’ సినిమాలో రిసెప్షనిస్టు పాత్రని ఇచ్చారు. ఆ తర్వాత జంధాల్య చిత్రాల్లోనే ‘మల్లెపందిరి’, ‘నాలుగు స్తంభాలాట’లో పాత్రలు దక్కాయి. ఆ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో సుత్తివేలు ఉద్యోగం పోగొట్టుకొన్నారు. ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా భావించి ‘ఆనంద భైరవి’, ‘రెండు జెళ్ళ సీత’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘చంటబ్బాయి’ తదితర విజయవంతమైన చిత్రాల్లో హాస్య ప్రధానమైన పాత్రలు పోషించారు. ‘త్రిశూలం’ చిత్రం తర్వాత అవకాశాలు తగ్గినా టి.కృష్ణ వరుసగా తన చిత్రాల్లో అవకాశాలు ఇవ్వడంతో విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు ఆస్కారం లభించింది. ‘వందేమాతరం’, ‘ప్రతిఘటన’, ‘కలికాలం’, ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రాల్లో సుత్తివేలు పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ‘వందేమాతరం’ చిత్రానికిగానూ ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు సుత్తివేలు. ‘దేవాలయం’, ‘గీతాంజలి’, ‘మాస్టారి కాపురం’ చిత్రాలకిగానూ ఉత్తమ హాస్యనటుడిగా పురస్కారాలు స్వీకరించారు. సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు కలిసి నటించారంటే ఇక ఆ సినిమాలో నవ్వులు గ్యారెంటీ అనుకొనేవారు అప్పట్లో. నేడు సుత్తివేలు వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.