ఆయన నవ్వితే మనకు నవ్వొస్తుంది. నవ్విస్తే పొట్ట చెక్కలవుతుంది. విచిత్రమైన మ్యానరిజమ్స్, వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్ , వింత గొలిపే హావభావాలు.. ఆయనను నవ్వుల సామ్రాజ్యానికే రారాజును చేశాయి. టాలీవుడ్ లో తాగుబోతు పాత్రలకు పేటెంట్ రైట్స్ తీసుకుని ఆ పాత్రలకు తానే బ్రాండ్ అంబాసిడర్ నని నిరూపించుకున్న ఆయన పేరు యం.యస్.నారాయణ. అమాయకమైన పాత్రలతో కెరీర్ ప్రారంభించి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేవరకూ నటించిన ఆయనది ఒక శకం.

భీమవరంలో తెలుగు లెక్చరర్ గా పనిచేసే యం.యస్ .నారాయణ టాలీవుడ్ లో రైటర్ అవ్వాలని వచ్చారు. అనుకోకుండా నటుడిగా మారారు. ఆపై హాస్యనటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చివరకు స్టార్ రైటర్ అయ్యేవరకూ తన ప్రయాణాన్ని కొనసాగించారు. ‘వేగు చుక్క పగటి చుక్క’ చిత్రంతో కథారచయితగా మారారు. ఆ తరువాత ఎనిమిది చిత్రాలకి పనిచేశారు. ‘ఎమ్‌.ధర్మరాజు ఎమ్‌.ఎ’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. ‘పుణ్యబూమి నాదేశం’, ‘రుక్మిణి’ చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన ఆయనకి ఈవీవీ దర్శకత్వం వహించిన ‘మా నాన్నకి పెళ్ళి’ తిరుగులేని పేరు తీసుకొచ్చింది. దర్శకులు తనకి ఇచ్చిన పాత్రలకి తానే సంభాషణలు రాసుకొని సినిమాల్లో పలికేవారు ఎమ్మెస్‌. ‘రామసక్కనోడు’, ‘మా నాన్నకి పెళ్లి’, ‘సర్దుకుపోదాం రండి’, ‘శివమణి’, ‘దూకుడు’ చిత్రాలకిగానూ ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. సుమారు 200 చిత్రాల్లో ఆయన తాగుబోతు పాత్రధారిగా నటించి నవ్వించారు. ‘దూకుడు’, ‘డిస్కో’, ‘దుబాయ్‌ శీను’ తదితర చిత్రాల్లో పేరడీ పాత్రలు చేసి మెప్పించారు. నేడు యం.యస్. నారాయణ జయంతి. ఈ సందర్భంగా ఆ నవ్వుల నారాయణకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్ .

 

Leave a comment

error: Content is protected !!