అతడు నవ్వుతుంటే.. బుగ్గలకు రెండు వైపులా సొట్టలు. కానీ అతడి హాస్యానికి మనం నవ్వుతుంటే.. మాత్రం మన బుగ్గలు నొప్పి పెడతాయి. తను నవ్వక మనల్ని నవ్వించే అద్భుత టాలెంట్ అతడి సొంతం. బాల నటుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి.. నాలుగు దశాబ్దాలకు పైగానే టాలీవుడ్ ఇండస్రీలో హాస్యనటుడిగా కొనసాగడం సాధారణమైన విషయం కాదు. దాదాపు 1100కు పైగానే చిత్రాల్లో నటించడం మాటలు కాదు. ఆయన పేరు ఆలి. ఎంద చేట, కాట్రవల్లి, జలకండ్రి, జాపత్రి లాంటి ఊతపదాలు ఆయన పలికితేనే మనకు నవ్వు పుట్టుకొస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న హాస్యనటులు అందరిలో కెల్లా మోస్ట్ సీనియర్ కమెడియన్ ఆయనే. అంతగా చదువుకోకపోయినా.. తనకున్న కామెడీ టాలెంట్ తో ఇప్పటికీ ఆఫర్స్ దక్కించుకుంటూ హాస్య నటుడిగా కొనసాగుతున్నారంటే.. దానికి కారణం ఆయన టాలెంటే.

రాజమండ్రి లో జన్మించిన ఆలి.. చిన్న వయసులోనే సినీ యాక్టర్స్ ను ఇమిటేట్ చేయడం మొదలు పెట్టారు.  ఒకసారి రాజమండ్రి పరిసరాల్లో ‘ప్రెసిడెంట్‌ పేరమ్మ’ చిత్రీకరణ జరుగుతుంటే ఆ సినిమా బృందానికి వినోదం పంచడం కోసం జిత్‌ మోహన్‌ మిత్రా బృందం వెళ్లింది. అక్కడ అలీ ప్రదర్శనని చూసిన ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ అందులో బాలనటుడిగా నటించే అవకాశాన్నిచ్చారు. ఆ తరువాత ‘దేవుడు మావయ్య’, ‘ఘరానా దొంగ’, ‘సిరిమల్లె నవ్వింది’, ‘ముక్కోపి’ తదితర చిత్రాల్లో బాలనటుడిగా మెరిసి గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే ఆయన కెరీర్‌ ‘సీతాకోక చిలుక’ చిత్రంతో మలుపు తిరిగింది. భారతీరాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కథానాయకుడి స్నేహితుల బృందంలో ఒకడిగా నటించి పేరు తెచ్చుకొన్నారు అలీ. ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘మాయలోడు’, తదితర చిత్రాల్లో హాస్య పాత్రలతో అదరగొట్టిన ‘యమలీల’, ‘ఘడోత్కచుడు’ తదితర చిత్రాలతో కథానాయకుడిగా కూడా విజయాలు అందుకొన్నారు. ఒక పక్క కథానాయకుడిగా నటిస్తూనే, మరో పక్క హాస్య పాత్రల్నీ వదిలి పెట్టకుండా ప్రేక్షకుల్ని నవ్వించాడు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ అలీ నటించి పేరు తెచ్చుకొన్నారు. టెలివిజన్‌తోనూ అలీకి అనుబంధం ఉంది. ‘అలీ 369’, ‘అలీతో సరదాగా’, ‘అలీతో జాలీగా’ వంటి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులకి వినోదం పంచుతున్నాడు. అలీ తమ్ముడు ఖయ్యూమ్‌ కూడా నటుడే.  నేడు ఆలీ పుట్టిన రోజు.ఈ సందర్భంగా ఆయనకి శుభకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!