అహంకారం ఆమెకు అలంకారం.. ఆత్మవిశ్వాసం ఆమెకు ఆభరణం. మాటకారి తనం ఆమె మేనరిజం. కలుపుగోలు తనం ఆమె నైజం. నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో నిర్వాహకరాలిగా, సంగీత దర్శకురాలిగా, రచయిత్రిగా .. ఇలా ఎన్నో శాఖల్ని ఒంటి చేత్తో నడిపించి .. బహుముఖ ప్రజ్ఞ ను చాటుకున్న నటశిరోమణి. పేరు భానుమతి రామకృష్ణ. తెలుగులో తొలి మహిళా దర్శకురాలు. మంచి అభిరుచి గల నిర్మాత. గాయనిగా చిరస్మరణీయురాలు. రచయితగా సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. అన్నీ కలిసి ‘పద్మభూషణు’రాలు! అలనాటి తొలి సూపర్‌స్టార్‌గా పేరు పొందిన నటీమణి భానుమతి.

తెలుగులో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాల్లో నటించారు భానుమతి. మల్లీశ్వరి, అంతా మనమంచికే, తోడునీడ, అంతస్తులు, మట్టిలో మాణిక్యం, బాటసారి, లైలామజ్ను , ప్రేమ, చక్రపాణి .. ఇంకా ఎన్నో చిత్రాలు ఆమె నటనా ప్రతిభకు నిదర్శనాలు గా నిలిచిపోయాయి. అక్కినేని నాగేశ్వరరావుకి, భానుమతి, రామకృష్ణలమీద ఎనలేని గౌరవం, భక్తీ. ‘‘నేనింకా పరిణతి పొందక ముందే నాకు ‘లైలామజ్ను’ సినిమా ఇచ్చారు. ‘విప్రనారాయణ’, ‘బాటసారి’ వంటి గొప్పపాత్రలు ఇచ్చారు’’ అని చెప్పేవారు.
భానుమతి మధురమైన గాయని. ఆమె కంఠం సుడులు, చక్రాలూ తిరిగినట్టు పలుకుతుంది. సంగీత కచేరీలలో పాడేవాళ్లు తక్కిన వాళ్లు పాటలు పాడతారు గానీ, భానుమతి పాటలు పాడడం తక్కువ. ఆమెని అనుసరిస్తూ పాడడం తేలికైన విషయం కాదు. భానుమతి వేరెవరికీ ప్లేబాక్‌ పాడలేదు. తనకెవరూ పాడలేదు. అయితే ‘చండీరాణి’ హిందీలో మాత్రం సంధ్యకి భానుమతి గాత్రం వినిపిస్తుంది.

రామకృష్ణలాంటి భర్త దొరకడంతో, కొడకు భరణిపేరుతో రామకృష్ణ దర్శకత్వంలో చిత్రనిర్మాణం ఆరంభించి ‘రత్నమాల’, ‘లైలామజ్ను’, ‘ప్రేమ’, ‘చండీరాణి’, ‘చక్రపాణి’, ‘విప్రనారాయణ’, ‘చింతామణి’, ‘వరుడుకావాలి’, ‘బాటసారి’, ‘వివాహబంధం’, ‘గృహలక్ష్మి’, ‘అంతా మనమంచికే’, ‘విచిత్ర వివాహం’, ‘అమ్మాయిపెళ్లి’, ‘మనవడికోసం’ ‘రచయిత్రి’, ‘ఒకనాటి రాత్రి’ ‘భక్త ధ్రువ-మార్కండేయ’ మొదలైన చిత్రాలు నిర్మించారు. విశేషం ఏమిటంటే, ‘చండీరాణి’ని మూడు భాషల్లో నిర్మించారు. భానుమతే డైరెక్టు చేశారు. అలా తెలుగులో మొదటి దర్శకురాలుగా పేరు తెచ్చుకున్నారు. ‘వరుడు కావాలి’, ‘అమ్మాయిపెళ్లి’, ‘మనవడి కోసం’, ‘రచయిత్రి’, ‘ఒకనాటి రాత్రి’, ‘భక్తధ్రువ-మార్కండేయ’, అత్తగారూ జిందాబాద్ లాంటి చిత్రాల్ని భానుమతి డైరక్టు చేశారు. ఇందులోని విశేషం ఏమిటంటే ‘రచయిత్రి’ ‘ఒకనాటిరాత్రి’ చిత్రాలు సెన్సార్‌ అయినాయి గాని విడుదల కాలేదు. అంతేకాదు ఆమె అత్తగారూ జిందాబాద్ లాంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇంకా మంగమ్మగారి మనవడు, బామ్మమాట బంగారుబాట , అత్తగారూ స్వాగతం లాంటి సినిమాల్లో బామ్మగానూ, అమ్మమ్మగానూ ,అత్తగారు గానూ నటించి ఆ వయసులో కూడా సత్తా చాటుకున్నారు. నేడు భానుమతీ రామకృష్ణ జయంతి.ఈ సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!