అందం, అమాయకత్వం కలగలిసిన ముగ్ధమోహన రూపం ఆమెది. సహజమైన నటన, చిరునవ్వుల కలబోత ఆమె. చీరకట్టులో ఆమె అందరికీ అందాల కనికట్టు చేస్తుంది.  గ్లామరస్ పాత్రలకు బహు దూరం. హోమ్లీ కేరక్టర్స్ ను పెట్టింది పేరు. కొన్ని దశాబ్దాల పాటు.. దక్షిణాది వెండితెరమీద ఎన్నో చిత్రాలు.. మరెన్నో పాత్రలు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీల్లో అగ్ర హీరోలందరి సరసన జోడీ కట్టిన వైనం… ఎన్నో విజయాల మజిలీలు చేరుకున్న తీరు నేటి తారలకు స్ఫూర్తిదాయకం. ఆమె పేరు సుజాత. సహజమైన అభినయం ఆమె ఆభరణం. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్, నిర్మాత పి.ఆర్‌.గోవిందరాజన్‌ సుజాతను తమిళ సినిమా పరిశ్రమకు ‘అవల్‌ ఒరు తొడర్‌ కథై’ (తెలుగులో అంతులేని కథ )అనే సినిమా ద్వారా పరిచయం చేశారు. సుజాత ఇందులో ప్రధాన పాత్రలో రాణించారు. ఇక అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. వరుస చిత్రాలు, కాల్‌ షీట్లతో బిజీ అయ్యారు. లోకనాయకుడు కమల్‌ హాసన్‌తో పలు సినిమాలలో నటించారు. అదే సమయంలో వివిధ ఇండస్ట్రీల్లో ఎన్టీఆర్, శివాజీ గణేశన్, రజినీకాంత్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్‌ బాబు, కృష్ణలతో పాటు ఆ తర్వాత తరం హీరో అయిన చిరంజీవితో కూడా నటించారు.

తమిళ, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలన్నిటిలో సుజాత 300 సినిమాలపైగా చేశారు. అయితే, ఒక్క తమిళ భాషలోనే దాదాపు రెండు వందల సినిమాలలో నటించారు. సుజాత కొన్ని సినిమాలలో గ్లామరస్‌ పాత్రలను సైతం చేశారు. ఆ తరువాత 1980ల చివరి నాటికీ తల్లి తరహా పాత్రల్లోకి మారారు. దర్శకుడు ఎలా నటిస్తే బాగుంటుందని అనుకుంటారో సుజాత అలాగే నటించేవారు. నేడు సుజాత వర్ధంతి. ఈ సందర్భంగా ఆ  నట విదుషీమణికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!