మెగాస్టార్ చిరంజీవి 152 మూవీగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ రోజుకో సరికొత్త అప్డేట్ తో అభిమానుల్ని ఊరిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్నఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ హౌస్,మ్యాట్నీమూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. దేవదాయ శాఖలోని అవినీతిని, అక్రమాన్ని ఎండగట్టే కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో చెర్రీ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ‘మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నంబర్ 150‘ ( ఒక పాటలో )’ చిత్రాల్లో చిరు, చిరుత ఒకే తెరమీద కనిపించి అభిమానులకి మరిచిపోలేని ట్రీట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో ఆ అవకాశం లేదు. ఎందుకంటే.. ఇందులో యంగర్ చిరంజీవిగా చరణ్ కనిపిస్తాడని వినికిడి.
దేవదాయ శాఖలో నిజాయితీ పరుడైన ఒక ఆఫీసర్ గా ‘ఆచార్య’ లో మెగాస్టార్ నటిస్తున్నాడట. ఆ శాఖలో తలెత్తిన భూవివాదాల్ని, అక్రమాల్ని , అవినీతిని ధైర్యంగా ఎదుర్కొని దాని వెనకనున్నదుష్టశక్తుల్ని ఏరిపారేస్తాడట. అయితే అలాంటి ‘ఆచార్య’ పాత్ర పూర్వాశ్రమంలో ఒక నక్సలైట్ అట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఆ పాత్రలో చరణ్ కనిపిస్తాడని ఫిల్మ్ నగర్ సమాచారం. 20 నిమిషాల పాటు సాగే ఆ పాత్రలో చిట్టిబాబు అదరగొట్టేస్తాడట. అందుకే ఆ పాత్ర కోసం అతడికి జతగా రామలక్ష్మి సమంతాను కూడా సీన్ లోకి తెస్తున్నారట. ఆల్రెడీ ‘రంగస్థలం’లో తమ అసాధారణ అభినయంతో మెప్పించిన ఈ ఇద్దరూ ‘ఆచార్య’ చిత్రానికి కూడా హైలైట్ అవుతారని కొరటాల శివ భావిస్తున్నాడట. మరి చిట్టిబాబు, రామలక్ష్మి ఈ చిత్రానికి ఏ రేంజ్ లో అడ్వాంటేజ్ అవుతారో చూడాలి.