హిట్లర్ మీసం. అమాయకత్వం ఉట్టిపడే ముఖం. జీర్ణావస్థకు చేరిన నల్లని కోటు.. శిధిలావస్థకు చేరిన నల్లని బూట్లు.. చేతిలో వంకీ కర్ర.. నేల మీద నిలబడలేని నడక. నిమిష నిమిషానికి నవ్వు పుట్టించే నటన.. ప్రతీ సన్నివేశంలోనూ పొట్టచెక్కలు చేసే ప్రవర్తన. ఇవన్నీ ఒక్క మనిషిలోనే ఉంటే .. అతడే చార్లీ చాప్లిన్. హాస్య ప్రపంచానికి ఎప్పుడూ ఆయన చక్రవర్తే. గుండెను పిండేసే విషాదాన్ని తనలోనే దాచుకొని.. ఈ లోకాన్ని నవ్వులతో ముంచెత్తిన ఆయన అప్పటికీ , ఇప్పటికీ, ఎప్పటికీ  కామెడీ కింగే.

మూకీలైనా,  టాకీలైనా, రెండు నిముషాలైనా,  రెండు గంటలైనా, పిల్లలైనా,  పెద్దలైనా, ఆనందించి, ఆస్వాదించి, అనుభవించి, పరవశించి, కేరింతలు కొట్టి, చప్పట్లు కొట్టి, పట్టుబట్టి మళ్లీమళ్లీ చూసేలా చేసే అపురూప, అద్భుత, అసాధారణ, అనన్యసామాన్య… కళాప్రదర్శనం ఆయనది. 1889 ఏప్రిల్‌ 16న పుట్టిన చాప్లిన్, 1977 డిసెంబర్‌ 25న మరణించేలోగా వేదనాభరిత రోజుల్ని, వైభవోపేతమైన దశల్ని, అవమానకరమైన పరిస్థితుల్ని, వివాదప్రదమైన స్థితిగతుల్ని కూడా అనుభవించాడు. కడుపు నింపుకోవడం కోసం పని చెయ్యక తప్పని బాల్యం నుంచి దొరికిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ, ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ, అనుభవాలు పేర్చుకుంటూ, నైపుణ్యాలు కూర్చుకుంటూ… ఓ హాస్య నటుడిగా, ఓ చిత్ర నిర్మాతగా, ఓ సంగీతకారుడిగా, ఓ రచయితగా ప్రపంచ స్థాయికి ఎదిగి సినీరంగంలో చెరగని ముద్ర వేయగలిగాడు.

ఎన్నో కంపెనీలు అతడితో ఒప్పందం కోసం క్యూ కట్టాయి. అలా 26 ఏళ్లకల్లా ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యధికంగా పారితోషికం అందుకునే నటుడిగా చాప్లిన్‌ ఖ్యాతి పొందాడు. ‘ది ఫ్లోర్‌ వాకర్‌’, ‘ది ఫైర్‌మేన్‌’, ‘ది వేగబాండ్‌’, ‘వన్‌ ఏఎమ్‌’, ‘ది కౌంట్‌’, ‘ది పాన్‌షాప్‌’… లాంటి ఎన్నో సినిమాల్లో యువ చాప్లిన్‌ కడుపుబ్బ నవ్వించాడు. నేడు చార్లీ చాప్లిన్ జయంతి. ఈ సందర్భంగా ఆ మహానటుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్ .

 

Leave a comment

error: Content is protected !!