ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో.. అన్నాడో సినీ కవి. నిజంగా అలాంటి పారిజాతం ఈ భువిలో విరిస్తే.. చూడ్డానికి మన రెండు కళ్ళూ చాలవు. చంద్ర బింబంలాంటి మోము.. చక్రల్లాంటి కళ్ళు… బంగారం లాంటి శరీర ఛాయ… నవ్వితే నవరత్నాలు రాలిపడే.. దంతసిరి. ఇవన్నీ కలగలిస్తే.. బాలీవుడ్ సుందరి జరీన్ ఖాన్. అచ్చంగా కత్రినా కైఫ్ ను పోలి ఉండే.. ఆమె అందానికి యావత్ యువత దాసోహం.
ముంబైలో పఠాన్ కుటుంబంలో పుట్టి పెరిగింది జరీన్ ఖాన్. డ్యురెలో కాన్వెంట్ హైస్కూల్, రిజ్వి సైన్స్ కాలేజ్‌లలో విద్యాభ్యాసం కొనసాగించింది. ఇంటర్‌మీడియట్ పూర్తయ్యాక సుభాష్ ఘయ్ ఫిల్మ్‌స్కూల్‌ల్లో వేసిన ‘యువరాజ్’ సెట్ చూడ్డానికి వెళ్లింది. అక్కడే వున్న సల్మాన్‌ఖాన్ దృష్టిలో పడింది. కత్రిన పోలికలున్న జరీన్ ఖాన్ ని తన చిత్రం కోసం ఎంపిక చేశాడు. అలా అనుకోకుండానే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. డాక్టర్ కావాలనుకొన్న .జరీన్ సల్మాన్‌ఖాన్ చొరవతో యాక్టర్ అయింది. ‘వీర్’లో సల్మాన్ సరసన యువరాణిగా నటించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ జరీన్ అచ్చం కత్రినాకైఫ్‌లా ఉందని మెచ్చుకొన్నారు. అయితే ఆమె నటన మాత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. కొత్త కథానాయికల్ని ప్రోత్సహించడంలో ముందుండే సల్మాన్‌ఖాన్… జరైన్‌నిబాగా ప్రమోట్ చేశాడు. ఆమె నటించిన తొలి చిత్రం ‘వీర్’ సరైన ఫలితాన్ని సాధించలేకపోయినా… మరో అవకాశాన్నిచ్చాడు. ‘రెడీ’లో ఆమె ఓ ప్రత్యేక పాత్రలో మెరిసింది. ‘క్యారెక్టర్ ధీలా…’ అంటూ సాగే ప్రత్యేక గీతంలో మెరిసింది. ఆ చిత్రం తర్వాత జరీన్ ఖాన్ కి మంచి గుర్తింపు, ప్రశంసలు లభించాయి. కొత్త అవకాశాలు రావడం కూడా మొదలయ్యాయి. కేవలం హిందీకే పరిమితం కాకుండా… ప్రాంతీయ చిత్రాల్లోనూ నటించాలని నిర్ణయించుకొంది జరీన్ ఖాన్. అందులో భాగంగా తమిళంలో ‘నాన్ రజవాగ పొగిరెన్’లో ఓ ప్రత్యేక గీతం చేసింది. ఆమె సందడి తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అలాగే పంజాబీలో ‘జాట్స్ జేమ్స్‌బాండ్’లో నటించింది. లల్లి అనే పంజాబీ మహిళ పాత్రలో జరైన్ నటన అందరికీ నచ్చింది. అక్కడ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు నూతన ఉత్తమ కథానాయికగా అవార్డును అందుకుంది. తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘చాణక్య’ చిత్రంలో ‘ర్రా’ ఏజెంట్ జుబైదా ఖాన్ పాత్రలో నటించింది. నేడు జరీన్ ఖాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ పారిజాతానికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.