మన తెలుగు సినిమా జెండాను ప్రపంచవ్యాప్తంగా రెపరెపాడేలా చేసిన దర్శక ధీరుడు ఆయన. మన సినిమాతో బాలీవుడ్ దర్శకుల అహంకారాన్ని అణిచిన దర్శక ప్రతిభ ఆయనది. తన కెరీర్ లో ఇంతవరకూ ఒక్కంటంటే ఒక్క పరాజయం ఎరుగని అజేయ దర్శకుడు ఆయన. ఒక సినిమాను ఎంత ఎక్కువ సమయం తీసుకొని తెరకెక్కిస్తాడో .. అంతకన్నా ఎక్కువ స్థాయిలో అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చే దర్శకుడు ఆయన ఒక్కరే. పేరు రాజమౌళి. టాలీవుడ్ లో ఆయన పెర్ఫెక్షన్ గురించి బాగా తెలిసినవాళ్ళు ఆయన్ను జక్కన్న అని పిలుస్తారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన రాజమౌళి… సినిమా సినిమాకీ తన స్థాయిని పెంచుకోవడమే కాకుండా.. తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచిన దర్శక బాహుబలి.
ఈటీవీలో ప్రసారమైన ‘శాంతినివాసం’ ధారావాహికని తెరకెక్కించారు. స్టూడెంట్ నెంబర్ 1’తో దర్శకుడిగా పరిచయమైన తక్కువ సమయంలోనే స్టార్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు. ‘సింహాద్రి’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలతో తన సత్తా చాటారు. ఆయన తీసిన చిత్రాలన్నీ ఒకెత్తైతే… రెండు భాగాలుగా వచ్చిన ‘బాహుబలి’ చిత్రాలు మరో ఎత్తు. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ రికార్డులు సృష్టించింది.
భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మశ్రీ’ గౌరవాన్ని స్వీకరించిన రాజమౌళి ‘మగధీర’ చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు. ఆయన తీసిన ‘ఈగ’ ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారానికి ఎంపికైంది. బాహుబలి ది బిగినింగ్’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.