విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా.యన్టీఆర్ నటజీవితంలో మరపురాని కుటుంబకథాచిత్రం తోడూనీడా. 1965లో విడుదలైన ఈ సినిమాకి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. విజయభట్ మూవీస్ పతాకంపై యన్.యన్.భట్, ఎ.రామిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. భానుమతి రామకృష్ణ కథానాయికగా నటించగా.. జమున, యస్వీఆర్, నాగయ్య , గీతాంజలి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కె.వి.మహాదేవన్ సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా మళ్ళున్నా. మాన్యాలున్నా, అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా లాంటి పాటలు అత్యధిక ప్రజాదరణ పొందాయి.

దయామయుడైన ధర్మారావుకు రాజా అనే కొడుకు, రాధ అనే కూతురు ఉంటారు. రాజా తన క్లాస్‌మేట్ రాణిని పెళ్ళి చేసుకుంటాడు. ధర్మరావు తన కూతురును గోపీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. రాధ తన కూతురును పట్టించుకోకపోవడంతో ఆ పాప రాధ, గోపీలకు చేరువ అవుతుంది. వాళ్ళని అమ్మ, నాన్న అని పిలుస్తూ వుంటుంది. అది రాణి తండ్రి నాగరాజుకు కంటగింపుగా వుంటుంది. ఆ పాప ధర్మారావు ఆస్తికి వారసురాలు అనే విషయం బాగా తెలిసిన నాగరాజు రాధ, గోపీలను విడగొడతాడు. గోపీ బాధతో కుంగిపోతాడు. చివరకు కలెక్టరు.. ఆనందరావు కూతురు, రాధ స్నేహితురాలు అయిన లక్ష్మిని పెళ్ళి చేసుకుంటాడు. కానీ అతడు రాధను మరిచిపోలేక పోతాడు. లక్ష్మిని తన జీవితంలోనికి ఆహ్వానిచలేక పోతాడు. అయితే లక్ష్మి అతని మనసును, పాప మనసును ఎలా గెలుచుకున్నది అనేది మిగతా కథ. నిజానికి ‘తోడూనీడా’ ‘కర్పగం’ తమిళ సినిమాకి రీమేక్ వెర్షన్. జెమినీ గణేశన్ , సావిత్రి జంటగా నటించిన ఈ సినిమా అక్కడ కూడా ఘన విజయం సాధించింది.

 

Leave a comment

error: Content is protected !!