ఆయన అభినయం అద్భుతం.. ఆంగికం అద్వితీయం.. వాచకం అనితర సాధ్యం. ఎలాంటి పాత్రనైనా అలలీలగా పోషించగల ప్రజ్నాశాలి. ఏ రసాన్నైనా అనాయాసంగా ఒలికించగల ప్రతిభాశాలి. ఆయన పేరు చిత్తూరు వి.నాగయ్య. తెలుగు సినిమా పుట్టిన తర్వాత వెండితెరకు తొలి సూపర్ స్టార్ ఆయనే.
1904, మార్చి 28న చిత్తూరు జిల్లాలో బ్రాహ్మణ కుటుంబాబికి చెందిన రామలింగ శర్మ, వెంకట లక్ష్మాంబ దంపతులకు నాగయ్య జన్మించారు. ఆయన అసలు పేరు ‘ఉప్పలదడియం నాగయ్య శర్మ’. ఆయన బాల్యం అంతా చిత్తూరు జిల్లాలోనే సాగింది, అప్పట్లో నాగయ్య గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి స్కాలర్షిప్ తో చదువుకోవడం, ఆపై తన డిగ్రీ చదువును కూడా అదే జిల్లాలో పూర్తి చేయడం జరిగింది. చదువుల అనంతరం ఒక గవర్నమెంట్ ఆఫీసులో కొన్నాళ్లపాటు క్లర్క్ గా పనిచేసిన నాగయ్య గారు, ఆపై కొన్నాళ్ళు ఆంధ్ర పత్రిక తరపున జర్నలిస్ట్ గా కూడా పనిచేశారు.
అనంతరం సినిమాల మీద ఆసక్తితో 1938లో గృహలక్ష్మి అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన నాగయ్య నటుడిగా మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించడంతో ఆయనకు అవకాశాలు మొదలయ్యాయి. ఆపై వందేమాతరం, సుమంగళి, విశ్వమోహిని, దేవత, భక్తపోతన తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు నాగయ్య . అంతేకాక అప్పట్లో ఆయన అశోక్ కుమార్, మీరా, చక్రధారి వంటి తమిళ సినిమాల్లో కూడా నటించి తమిళ ప్రేక్షకుల మెప్పు కూడా పొందారు. ఇక అక్కడినుండి కెరీర్ పరంగా ఎన్నో సినిమాల్లో నటించిన నాగయ్య గారు కేవలం నటుడిగానే కాక సంగీత దర్శకుడిగా, సింగర్ గా, నిర్మాతగా, రచయితగా పలు చిత్రాలకు పనిచేసారు. ఇక ఆయన 1964లో నటించిన రామదాసు చిత్రం, ఉత్తమ తెలుగుచిత్రంగా అప్పట్లో జాతీయ అవార్డు గెలుచుకుంది. ఆ తరువాత 1965లో నాగయ్య గారిని ఆంధ్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించడం జరిగింది. తెలుగు సినిమా అగ్రనటులు ఎన్టీఆర్, ఎఎన్నార్ వంటి వారు పూర్తిగా నటనలో ప్రవేశించక మునుపే, నాగయ్య గారు తెలుగు చిత్ర సీమలో మంచి గుర్తింపు పొందిన నటుడిగా కొనసాగారు. ఇక అప్పట్లో లక్ష రూపాయల పారితోషికం అందుకున్న ఏకైక నటుడైన నాగయ్య గారిని, ఆ తరువాత పలు సందర్భాల్లో ఎందరో నటీనటులు తొలితరం సూపర్ స్టార్ అని ఆయనను కీర్తించేవారు. నేడు నాగయ్య వర్ధంతి. ఆ మహానటుడ్ని స్మరించుకుంటూ ఆయనకు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.