తెలుగు తెరపై అద్భుతాలు సృష్టించిన మహానుభావులు ఎందరో. అందులో ఒకరు తాపీ ధర్మారావు. ఆయన నాస్తికుడు, హేతువాది. అయినప్పటికీ అది ఆయన రచనలకి అడ్డంకి కాలేదు. ఆయన్నుఅందరూ తాతాజీ అని పిలుచుకొనేవారు. శృంగేరీ పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు, చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’ కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు. మరెన్నో సాహిత్య అవార్డులు ధర్మారావును వరించి తరించాయి.
తాపీ ధర్మారావు గిడుగు రామమూర్తి పంతులు శిష్యులు. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా వంటి పత్రికలలో పనిచేశారు. కళాశాల, సర్వే డిపార్ట్‌మెంట్‌లలో పలు ఉద్యోగాలు చేశారు. మాలపిల్ల సినిమా రచనతో సినీరంగ ప్రవేశం జరిగింది. ఆ సినిమాకి సంభాషణలు ఆయనే రాశారు. అలాగే.. రైతు బిడ్డ సినిమాతో గీత రచయిత కూడా అయ్యారు. ఇక ఆయన ఆఖరు సినిమా 1962 లో వచ్చిన ‘భీష్మ’. ఇక అక్కినేని నాగేశ్వరరావు ఎవర్ గ్రీన్ జానపద చిత్రం ‘కీలుగుర్రం’ సినిమాకి కూడా తాపీ ధర్మారావే రచయిత. నేడు తాపీ ధర్మారావు జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.