అందానికి అందం ఆమె.  ఒకప్పుడు  బాలీవుడ్  ప్రేక్షకుల్ని నిద్రపోనీకుండా చేసిన డ్రీమ్ గాళ్ ఆమె. దాదాపు మూడు దశాబ్దాల కాలంపాటు బాలీవుడ్ ను ఏలిన అందాల మందారం. వైజయంతి మాల తరువాత గొప్ప భరతనాట్య కళాకారిణిగా ప్రసిద్ధికెక్కిన అసమాన ప్రజ్ఞాశాలి. ఆమె పేరు హేమమాలిని.  ఆదుర్తి సుబ్బారావు కొత్తవారితో తీసే తేనే మనసులు సినిమా ఆడిషన్స్ కు ఆమె కూడా వెళ్ళారు. కానీ ఆమె రిజెక్ట్ అయింది.  కానీ  కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘పాండవ వనవాసము’ సినిమాలో ‘‘ఓ వన్నెకాడ నిన్ను చూచి నా మేను పులకించెరా ఓ వీరా’’ అనే యక్షిణి పాడే పాటకు నృత్యం చేసింది. ఆ తరువాతి కాలంలో ఢిల్లీలో వున్న హేమను కమలాకర కామేశ్వరరావు మద్రాసు పిలిపించి ‘శ్రీ కృష్ణ విజయము’ సినిమాలో రంభ పాత్రలో అతిధిగా నటింపజేసి ‘‘జోహారు శిఖిపించమౌళీ.. ఇదె జోహారు రసరమ్య గుణశాలి, వనమాలి’’ పాటకు నాట్యం చేయించారు. దక్షిణాది సినిమాల్లో రాణించాలని హేమ ఎంత ఆశించినా సరైన అవకాశాలు రాలేదు.

రాజ్ కపూర్ ‘స్వప్నోంకీ సౌదాగర్’ తో హేమమాలిని బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమా అంతగా పేరు తెచ్చిపెట్టలేదు.  అలాగే… హేమ నటించిన ‘జహా ప్యార్‌ మిలే’, ‘వారిస్‌’, ‘ఆంసూ అవుర్‌ ముస్కాన్‌’ సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆ తరువాత వచ్చిన ‘జానీ మేరా నామ్‌’ సూపర్‌ హిట్‌గా నిలిచి ఆమెను ‘డ్రీం గర్ల్‌’గా మార్చివేసింది. 1971లో వచ్చిన ‘అందాజ్‌’. ‘లాల్‌ పత్తర్‌’, ‘తేరే మేరే సప్నే’ సినిమాలు విజయవంతం కావడంతో హేమ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1972లో ద్విపాత్రాభినయం చేసిన ‘సీతా అవుర్‌ గీతా’ సినిమా ఆమెను శిఖరాగ్రం మీద కూర్చోబెట్టింది. హేమమాలిని సినిమాలంటే యువతరం ఉరకలు వేసేవారు. ఆమె ఫోటోలతో క్యాలెండర్లు కూడా ముద్రితమయ్యాయి. ధర్మేంద్ర సరసన నటించిన తొలి సినిమా ‘తుం హసీన్‌ మై జవాన్‌’ బాక్సాఫీసు హిట్టయింది. తరవాత వరుసగా ధర్మేంద్రతో ‘రాజా జానీ’, షరాఫత్‌’ సినిమాలు వచ్చి సూపర్‌ డూపర్‌ హిట్లై వారిద్దరినీ చూడముచ్చటైన జంటగా మార్చేశాయి. తెలుగులో బాలయ్య నటించిన ’గౌతమీ పుత్ర శాతకర్ణి‘లో రాజమాతగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు హేమమాలిని. నేడు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆ డ్రీమ్ గాళ్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!