Shopping Cart 0 items - $0.00 0

టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ @ ఫిబ్రవరి

ఈ ఏడాది బిగినింగ్ లో టాలీవుడ్ నిజంగానే సంక్రాంతి జరుపుకుంది. ఆ సీజన్ లోనూ, రిపబ్లిక్ డే సందర్బంగా విడుదలైన చిత్రాలన్నీ మ్యాజిక్ చేశాయి. అదే జోరును కొనసాగిస్తూ ఫిబ్రవరిలో కూడా కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలతో మెరిసింది టాలీవుడ్ బాక్సాఫీస్ . మరి ఫిబ్రవరి టాలీవుడ్ రిపోర్ట్ ఏంటో చూసేద్దాం.

జ్ఞాపకాల పుస్తకం జాను

యంగ్ హీరో శర్వానంద్, సమంత అక్కినేని జంటగా సి.ప్రేమ్ కుమార్ మలిచిన  నోస్టలాజికల్ లవ్ స్టోరీ ‘జాను’. తమిళ చిత్రం ‘96’  కు రీమేక్ వెర్షన్ గా వచ్చిన ఈ సినిమా భావోద్వేగాల పరంగా మెప్పించినా.. కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశపరిచింది. తమిళ చిత్రంతో పోలిక తేవడం వల్ల ఇది కేవలం  ఫీల్ గుడ్ మూవీగానే మిగిలిపోయింది. శర్వానంద్ , సమంతా మాత్రం తమ నటనతో తెలుగు ప్రేక్షకుల్ని గతంలోకి లాక్కెళ్ళిపోయారు.

నవ్వుల కోతి కొమ్మచ్చి …… ‘3మంకీస్’

‘జబర్దస్త్’ కామెడీ షో ఫేమ్  సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను హీరోలుగా నటించిన బ్లాక్ కామెడీ మూవీ ‘3 మంకీస్’ . కొన్ని పంచులు .. కాసిన్ని నవ్వులు తప్పితే .. ఈ మూవీలో ఏమీ లేదని ప్రేక్షకులు తీర్పు చెప్పారు.  హాస్య సన్నివేశాల్ని కాస్తంత బాగా రాసుకొని ఉంటే.. సినిమా బాగుండేదేమో కానీ..  సుడిగాలి సుధీర్  ఎలాంగ్ విత్ ది టీమ్ వెండితెరమీద మాత్రం మెప్పించలేకపోయారు.

‘వరల్డ్ ఫేమస్ లవర్’

‘జాను’ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి తెచ్చిపెట్టిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ . వేలెంటైన్స్ డే కానుకగా విడదలైన ఈ విజయ్ దేవరకొండ సినిమా కొన్ని వర్గాల వారినే మెప్పించగలిగింది. దర్శకుడు క్రాంతి మాధవ్  సంభాషణల రచయితగా మెప్పించగలిగినా.. మూడు డిఫరెంట్ లవ్ స్టోరీస్ ను జనరంజకంగా తెరకెక్కించడంలో విఫలమయ్యాడని చెప్పుకోవాలి. రౌడీ హీరో యాక్టింగ్ జిమ్మిక్కులు ఈ సినిమా విషయంలో సాగలేదు. కథ సరిగా లేకపోతే..  ఎలాంటి హీరో సినిమా అయినా..  బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టక తప్పదని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ప్రూవ్ చేసింది.

‘ప్రెషర్ కుక్కర్’… ఉడికీ ఉడకని వినోదం  

కొత్త కుర్రోళ్ళు సుజాయ్ , సుశీల్ సంయుక్త దర్శకత్వంలో సాయి రోనక్, ప్రతీ అస్రాని జంటగా తెరకెక్కిన యూత్ ఫుల్ మూవీ ‘ప్రెషర్ కుక్కర్’. ‘ప్రతీ ఇంట్లో ఇదే లొల్లి’ అనే ట్యాగ్ లైన్ తో అమెరికా వెళ్ళాలని కలలు కనే తల్లి దండ్రులకు .. ఆ పేరుతో అమెరికా వెళ్ళడానికి  స్ట్రగుల్ పడే కుర్రోళ్ళ జీవితాన్ని .. వినోదంతో రంగరించి చూపించాలని తాపత్రయ పడ్డారు దర్శక ద్వయం. అయితే ప్రతీ సారి అమెరికా అనే పదం .. అందరి నోట్లోంచి వినిపించి విసుగు తెప్పించడం .. ఈ సినిమా లోని వీక్ పాయింట్ . అలాగే..  సరైన కామెడీ సీన్స్ లేకుండా  కథ రాసుకొని అర్జెంట్ గా తెరకెక్కడం  అన్నిటికంటే పెద్ద డ్రా బ్యాక్ .  మొత్తం మీద ప్రెషర్ కుక్కర్ అనే ఇన్నోవేటివ్ టైటిల్ పెట్టుకొని .. ఉడికీ ఉడకని వినోదాన్ని వండి వార్చారన్నమాట. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయింది.

హాసమ్ ఎంటర్ టైనర్ ‘భీష్మ’

కొంత కాలంగా సరైన విజయాలు లేక సతమతమవుతోన్ననితిన్ కు ఈ ఫిబ్రవరి తెచ్చిపెట్టిన జాక్ పాట్ హిట్ ‘భీష్మ’.  ఛలో ఫేమ్ వెంకీ కుడుముల చేసిన  ఈ వినోదాల సేద్యం..  వెండి తెరమీద నవ్వుల మొలకలెత్తి.. బాక్సాఫీస్ వద్ద లాభాల పంట పండించింది. కన్నడ కస్తూరి రష్మికా మందణ్ణ గ్లామర్ , మలుపులతో నిండిన కథ .. ‘భీష్మ’ చిత్రాన్ని ఘన విజయ తీరాలకు చేర్చింది. సో.. అలా నితిన్ .. ఫిబ్రవరి బాక్సాఫీస్ కు కింగ్ గా మారాడు.

మనసు మనసునీ దోచిన ‘కనులు కనులను దోచాయంటే’

మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, తెలుగమ్మాయి రీతూ వర్మ నటించిన వైవిధ్య ప్రేమ కథా చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’ . గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే .. అబ్బుర పరిచే సన్నివేశాలు..  షాకిచ్చే రోబరీ ప్లానింగ్ .. ఉత్కంఠతను రేకెత్తించే ఛేజింగ్ ..  ఈ మూవీకి బ్యాక్ బోన్ గా నిలిచాయి. థ్రిల్లర్స్ కోరుకొనే ప్రేక్షకుల మనసును దోచుకొనే చిత్రం గా ‘కనులు కనులను దోచాయంటే’.. నిలిచిపోయింది. మొత్తం మీద  ఫిబ్రవరి  దుల్కర్ సల్మాన్  మది దోచిన నెల అయిందన్నమాట.

‘హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ … హిట్ కొట్టింది

‘ఈ నగరానికి ఏమైంది , ఫలక్ నుమా దాస్’ చిత్రాలతో అభినయ పరంగా మెప్పించిన విష్వక్ సేన్ ..  ఈ సారి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ‘హిట్’ తో వచ్చి  టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.  నానీ నిర్మాతగా .. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్  ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకుంది. నేర పరిశోధన నేపథ్యంలో సాగే .. డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఈ సినిమా కు హైలైట్ గా నిలుస్తుంది. థ్రిల్లర్ కథల్ని ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ‘హిట్’ .

సగమే మెప్పించిన ‘రాహు’

కృతి గార్గ్, అభిరామ్ కీలక పాత్రల్లో .. సుబ్బు వేదుల తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్‘ రాహు’. విభిన్నతరహా కథే అయినా.. దాన్ని పూర్తి స్థాయిలో తెరమీద ప్రజెంట్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడేవారికి నచ్చే చిత్రమే అయినా.. మరిన్ని గ్రిప్పింగ్ సీన్స్ ను రాసుకొని ఉండుంటే..  సినిమా రిజల్ట్ మరోలా ఉండేది. మొత్తానికి రాహు చిత్రం ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుంది.

విడుదలైన మరిన్ని చిత్రాలు

ఫిబ్రవరి నెల టాలీవుడ్ లో  మరికొన్ని చిత్రాలకు వేదికగా మారింది. నందు  ‘సవారి, నరసింహ నంది ‘డిగ్రీ కాలేజ్’, నీవల్లే నేనున్నా, ఒక చిన్నవిరామం, శివ 143, లైఫ్ అనుభవించు రాజా , వలయం, చీమ ప్రేమ మధ్యలో భామ, స్వేఛ్ఛ విడుదల కాగా.. వీటిలో ఏ ఒక్క చిత్రం కూడా కనీసంలో కనీసమైనా ఆడియన్స్ ను మెప్పించలేకపోవడం గమనార్హం.

సో.. మొత్తానికి ఫిబ్రవరి నెలలో  టాలీవుడ్ కొంచెం లాభం… కొంచెం నష్టం తీరుతో సాగింది. మరి మార్చ్ నెల టాలీవుడ్ కు ఏ మేరకు లాభాల్ని తెచ్చిపెడుతోందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!