కె.రాఘవేంద్రరావు తన కెరీర్ బిగినింగ్ లో తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ మూవీ జ్యోతి. సహజనటి జయసుధ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్టైంది. జయసుధ కెరీర్ ను సరికొత్త మలుపు తిప్పింది. మురళీ మోహన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. గుమ్మడి, రావుగోపాలరావు, సత్యనారాయణ, కృష్ణ కుమారి, గిరిబాబు, జె.వి.సోమయాజులు , శుభ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. క్రాంతి కుమార్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకి సత్యానంద్ మాటలు కూర్చగా.. చక్రవర్తి సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో జయసుధ నటనకు గాను ఆ ఏడు ఆమెకు ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కింది.
నవ్వుతూ తుళ్ళుతూ ఉండే జ్యోతి (జయసుధ) అనే అమ్మాయి రవి (మురళీమోహన్)ను ప్రేమిస్తుంది. కాని ఆమె హఠాత్తుగా తన తండ్రి వయసువాడైన రాజయ్య (గుమ్మడి) అనే పెద్ద మనిషిని పెళ్ళి చేసుకోవడం ఎవరికీ అర్ధం కాదు. ఆస్తి కోసం అని కొందరనుకొంటారు. అందరి సూటిపోటు మాటలను భరిస్తూనే జ్యోతి రాజయ్య ఇంటిలో కకావికలైన సంసారాన్ని చక్కబెడుతుంది. ఆమె అలా ఎందుకు చేసిందనే విషయం సినిమా చివరిలో తెలుస్తుంది. తాను కాలిపోతూ అందరికీ వెలుగునివ్వడం జ్యోతి లక్షణం అని తెలుసుకొంటారు. ఇందులో జె.వి. సోమయాజులు ఒక చిన్న పాత్ర పోషించాడు. ఇది ఆయన రెండవ సినిమా. ఇది దర్శకునిగా రాఘవేంద్రరావుకు, నిర్మాతగా క్రాంతి కుమార్‌కు మూడవ సినిమా. గిరిబాబు ఊతపదం “ఫస్ట్ టైమ్” ప్రేక్షకుల నోట నానింది. నిజానికి ఇది ‘మిలి’ బాలీవుడ్ సినిమాకి రీమేక్ వెర్షన్. అయితే ఈ సినిమా స్ర్కీన్ ప్లేను కాస్తంత మార్చి రాఘవేంద్రరావు సూపర్ హిట్ కొట్టడం విశేషం.