Shopping Cart 0 items - $0.00 0

‘జాను’ రివ్యూ

చిత్రం : ‘జాను’

నటీనటులు : శర్వానంద్ , సమంత అక్కినేని , తనికెళ్ళ భరణి,  వెన్నెల కిశోర్, తాగుబోతు రమేశ్, రఘుబాబు, గౌరీ జి కృష్ణన్, సాయికిరణ్ కుమార్ , వర్షా బొల్లమ్మ తదితరులు

సంగీతం : గోవింద్ వసంత

సినిమాటోగ్రఫీ : మహేంద్రన్ జయరాజ్

బ్యానర్ : శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్

నిర్మాత : దిల్ రాజు

డైలాగ్స్ : మిర్చి కిరణ్

రచన, దర్శకత్వం : సి.ప్రేమ్ కుమార్

విడుదల తేదీ : ఫిబ్రవరి 7, 2020

టాలీవుడ్ యంగ్ హీరోల్లో శర్వనంద్  ప్రత్యేకం. ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలతో , వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకే ప్రయత్నం చేస్తుంటాడు. ఎర్లియర్ గా ‘పడిపడి లేచె మనసు, రణరంగం’ చిత్రాలు వరుసగా పరాజయం పాలయినా .. తాజాగా తమిళ సూపర్ హిట్ చిత్రం ‘96’ రీమేక్ గా తెరకెక్కిన ‘జాను’ తో ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా వచ్చాడు . మరి ఈ సినిమాతో  శర్వా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాడు? ఎలాంటి అనుభూతినిస్తాడు అనే విషయాలు చూద్దాం.

కథ:

కే.రామచంద్ర వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్. ఫోటో గ్రఫీలో కొంతమంది యువతీ యువకులకు శిక్షణ కూడా ఇస్తూంటాడు. అందులో భాగంగా రామచంద్ర ఒకరోజు తన పుట్టిన ఊరు వైజాగ్ వెళతాడు. అక్కడ తను చదువుకున్న స్కూల్ ను,  ఆ స్కూల్లో తను వదిలి వెళ్లిన జ్నాపకాలను తలచుకుంటూ మధురానుభూతులకు లోనవుతాడు. దాంతో 2004 లో తనతో 10th క్లాస్ చదువుకున్న స్నేహితులతో రీయూనియన్ ఏర్పాటు చేసి.. అందరినీ తిరిగి అదే స్కూల్ దగ్గరకి రప్పిస్తాడు. వారితోపాటు అతడి చిన్ననాటి ప్రియురాలు ‘జాను’ కూడా వస్తుంది. ఆమెకు అప్పటికే పెళ్ళయిపోయి ఒక బిడ్డకు తల్లికూడా అవుతుంది.   చాలా ఏళ్ళ తర్వాత ఒకరినొకరు చూసుకున్న ఆపాత మధురమైన  ప్రేమికులు.. ఆ సమయంలో  అనుభవించిన  ఫీల్ అండ్ పెయిన్ ‘జాను’ చిత్ర  కథ.

కథనం విశ్లేషణ :

ఇప్పటివరకూ తెలుగులో చాలా ప్రేమ కథా చిత్రాలొచ్చాయి. అయితే వాటిలో ప్రేక్షకుల్ని ఎమెషనల్ గా కదిలించి.. సినిమా చూసిన తర్వాత కూడా వెంటాడే చిత్రాలు మాత్రమే అధిక శాతం సక్సెస్ సాధించాయి. అంటే సినిమా బిగినింగ్  నుంచీ ప్రేక్షకుడు అందులోని పాత్రలతో కనెక్ట్ అయిపోయి.. ఆద్యంతం వారితో ట్రావెల్ అయితే ఆ సినిమా తప్పకుండా విజయం సాధించినట్టే లెక్క. ‘జాను’ ఆ కోవకు చెందిన సినిమానే.  శర్వానంద్ పాత్ర ఇంట్రడక్షన్ తో ఒక అందమైన టేకాఫ్ తీసుకున్న సినిమా .. ఆ తర్వాత అతడు చదువుకున్న స్కూల్ లోకి,  ఆపై  అతడి జ్నాపకాల్లోకి మనల్ని లాక్కెళ్లిపోతుంది. అప్పుడొచ్చే సీన్స్ అందరి హృదయాల్ని తీయగా మెలిపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. టీనేజ్ లో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక లవ్ స్టోరీ తప్పకుండా ఉండే ఉంటుంది. అలాంటి వారందరూ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో తమను తాము చూసుకుంటారు. అంతేకాదు .. ఆ ఎమోషన్స్ తో అందరూ ట్రెవెల్ అయిపోతారు. ఇక వర్తమానంలోని హీరో, హీరోయిన్స్ తమ ప్రేమను గెలిపించుకోలేక పోయామని పడే ఫీల్ అండ్ పెయిన్ సినిమా అంతటికీ బలంగా నిలుస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ .. వాళ్ళ ఎమోషన్స్ తో మనమూ కనెక్ట్ అయిపోతాం. ఒక్క మాటలో చెప్పాలంటే..  ఒక అందమైన టీనేజ్ లవ్ స్టోరీతో దర్శకుడు ప్రేమ్ కుమార్  వెండితెర కేన్వాస్ పై గీసిన అద్భుతమైన పెయింటిగ్ ‘జాను’  .

‘96’ తమిళ చిత్రాన్ని చిన్నపాటి మార్పు కూడా లేకుండా.. సీన్ టు సీన్  షాట్ టు షాట్ తెరకెక్కించడం ‘జాను’ సినిమాకు బాగా కలిసివచ్చింది. సినిమా లో ఎక్కడా వల్గారిటీ అన్నదే లేకుండా.. క్లీన్ అండ్ క్లాస్ మూవీగా  సినిమా  తెరకెక్కడం అభినందించదగ్గది. సినిమా సెకండాఫ్ బాగా స్లో అయినా కూడా..  శర్వానంద్, సమంతాల పెర్ఫార్మెన్స్ ఆ లోపాన్ని మరిచిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తం  శర్వానంద్ , సమంతా పాత్రలు మాత్రమే  తెరమీద కనిపించినా.. వారి మధ్య వచ్చే సన్నివేశాలు  ఎక్కడా బోర్ కొట్టించవు. అంతేకాదు వారు పడే బాధకూ  కనెక్ట్ అయిపోతారు జనం .

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

టాలీవుడ్ బెస్ట్ పెర్ఫార్మర్స్ లో తాను కూడా ఒకడినని శర్వానంద్ ‘జాను’ చిత్రంతో మరోసారి నిరూపించాడు. ఒరిజినల్ వెర్షన్ లో అద్భుతంగా నటించిన విజయ్ సేతుపతి నటనతో పోలికలు వస్తాయని తెలిసినప్పటికీ.. ఆ పాత్రకు  తనదైన శైలిలోనే జీవం పోయడానికి తనవంతు తాను కృషి చేశాడు శర్వానంద్. అందులో అతడు  చాలా వరకూ సక్సెస్ అయ్యాడు. ఇక సమంతా విషయానికొస్తే.. 96లోని త్రిష పెర్ఫార్మెన్స్ కన్నా రెట్టింపు స్థాయిలో   నటించి మెప్పించింది. ముఖ్యంగా .. చిన్నప్పటి శర్వానంద్ తనను చూడ్డానికి కాలేజ్ కు వచ్చాడని తనకి నిజంగా తెలియదని బాధపడే సీన్ లో అయితే ఆమె పెర్ఫార్మెన్స్ అద్భుతం అనిపిస్తుంది. ఇక ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పాత్రలు జూనియర్ శర్వానంద్ ,జూనియర్ సమంత.. ఆ రెండు పాత్రల్ని పోషించిన సాయికిరణ్ కుమార్, గౌరీ జీ కృష్ణన్ తన నటనతో అదరగట్టేశారు.  ముఖ్యంగా జూనియర్ సమంతా అయిన గౌరీ జీ కృష్ణన్ కు అయితే.. ఈ సినిమా తర్వాత ఆమెకు  ఓ రేంజ్ లోఅభిమానులేర్పడిపోతారు. అంత అద్బుతంగా,  మెచ్యూర్డ్ గా, చాలా సెటిల్డ్ గా నటించి మెప్పించింది. ఆమె అమాయకమైన ముఖాన్నిఎవరూ అంత తొందరగా మరిచిపోలేరు కూడా. ఇక వెన్నెల కిశోర్, తాగుబోతు రమేశ్ హాస్యం నవ్వులు పూయిస్తుంది. టోటల్ గా ‘96’ చిత్రం  సోల్ ను ఎక్కడా మిస్ కాకుండా..దర్శకుడు ప్రేమ్ కుమార్ అదే స్థాయిలోని ఔట్ పుట్ నే ‘జాను’లో సామ్ అండ్ శర్వా మీద వర్కవుట్ చేశాడని చెప్పొచ్చు.

టెక్నీషియన్స్ పనితనం :

గోవింద్ వసంత సంగీతం ‘జాను’ చిత్రానికి మంచి ఫీల్ కలిగిస్తుంది. లిరికల్ వేల్యూస్ తో ఆకట్టుకొనే పాటలతోపాటు..  ప్రతీ సన్నివేశంలోనూ ఫీల్ ను క్యారీ చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్రాణం గా నిలుస్తుంది. ఇక సినిమాటోగ్రఫర్ మహేంద్రన్ జయరాజ్ విజువల్స్ జాను చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోతాయి. సినిమా బిగినింగ్ లో వచ్చే సాంగ్ లోని  అండర్ సీ సన్నివేశాల్లో ఆయన కెమేరా పనితనం అద్భుతం అనిపిస్తుంది. అలాగే నైట్ ఎఫెక్ట్ లో వచ్చే సీన్స్ లోనూ ఆయన టాలెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. సో.. మొత్తానికి  అందమైన జ్నాపకాలకు అద్దం పట్టే చిత్రం ‘జాను’ అని చెప్పాలి.

రేటింగ్ : 3.5

బోటమ్ లైన్ : గుండెల్ని పిండే ‘జాను’

review by : రామకృష్ణ క్రొవ్విడి

 

 

 

 

 

 

Leave a comment

error: Content is protected !!