సంగీత దర్శకుడు చక్రవర్తి  ఒకప్పుడు  టాలీవుడ్ లో చాలా బిజీ సంగీత దర్శకుడు. చాలా వేగంగా ట్యూన్స్ ఇస్తూ.. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో పాటల రికార్డింగులు పూర్తి చేసేవారు.  అయితే ఆయన ఎంతవేగంగా ట్యూన్ ఇస్తారో.. అంతే వేగంతో వేటూరీ పాటల్ని రాసేసేవారట. అయితే అలాంటి వేటూరికి, చక్రవర్తికి శోభన్ బాబు హీరోగా నటించిన ‘మల్లెపువ్వు’ సినిమా పాటల విషయంలో ఒక రోజు ఒక తమాషా సంఘటన జరిగిందట. అందులో చిన్న మాటా.. ఒక చిన్నమాట అనే పాట పల్లవి వేటూరికి ఎంతకీ తట్టడం లేదట. పది పన్నెండు రోజులు వేటూరి పల్లవిగా ఏదిరాసినా.. ఆ సన్నివేశానికి తగ్గట్టుగా కుదరడం లేదట. చివరికి వేటూరికి విసుగొచ్చి.. చిన్న ముక్క చిన్న ముక్క కూడా తట్టడం లేదే అని నిట్టూర్చారట. వెంటనే చక్రవర్తి ఆ ముక్కనే పేపర్ మీద పెట్టమని సలహా ఇచ్చారట. వెంటనే వేటూరి కలం తీసుకొని పేపర్ మీద చిన్న ముక్కా చిన్న ముక్కా అని రాసి పల్లవి మొదలుపెట్టారట. చివరికి అది చిన్నమాట చిన్న మాట అనే పల్లవి అయింది. గంటలో పాట మొత్తం పూర్తయిందట. అదీ సంగతి.

Leave a comment

error: Content is protected !!