యంగ్రీమేన్ రాజశేఖర్ కేవలం యాక్షన్ సినిమాల్లోనే కాకుండా.. ఎన్నో మంచి కుటుంబ కథాచిత్రాల్లో కూడా నటించారు. అందులో ఒకటి ‘గోరింటాకు’. అన్నాచెల్లెల బంధానికి కొత్త అర్ధాన్ని చెప్పిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. వి.ఆర్.ప్రతాప్ దర్శకత్వంలో యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2008 లో విడుదలైంది. రాజశేఖర్ , మీరా జాస్మిన్ అన్నచెల్లెళ్ళుగా నటించిన ఈ మూవీలో కథానాయికగా ఆర్తి అగర్వాల్ నటించింది. ఇంకా హేమా చౌదరి, సుజిత, మాస్టార్ నిదీష్, ఆకాశ్, చంద్రమోహన్, శివాజీరాజా, బెనర్జీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోతారు అశోక్ , లక్ష్మి. అశోక్ కు చెల్లెలంటే ప్రాణం. ఆమె ప్రేమించినవాడినే ఆమెకిచ్చిపెళ్ళి జరిపిస్తాడు. అశోక్ కూడా నందిని అనే అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాడు. ఇంతలో నందినికి అత్తకు వరుసైన కాంతం ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది. లక్ష్మి, నందిని ఇద్దరూ ఒకేసారి గర్బం ధరిస్తారు. లక్ష్మికి ఇద్దరు పిల్లలు పుడతారు. కానీ నందినికి గర్బం పోతుంది. దాంతో లక్ష్మి తన బిడ్డల్లో ఒకరిని నందినికి ఇస్తుంది. ఇంతలో లక్ష్మి భర్తను అతడి స్నేహితులు మోసం చేసి ఆస్తి అంతటినీ వారి పేర రాయించుకుని అతడ్ని జైలుకి పంపిస్తారు. అశోక్ లక్ష్మిని తన ఇంటికి తీసుకొస్తాడు. అయితే కాంతం సలహాతో నందిని లక్ష్మిని , ఆమె బిడ్డల్ని బైటికి గెంటిస్తుంది. దాంతో లక్ష్మి తన ఇద్దరు పిల్లలతోనూ ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె శవాన్ని చూసిన అశోక్ కు కూడా చనిపోతాడు. నిజానికి ఈ సినిమా శివరాజ్ కుమార్ హీరోగా నటించిన కన్నడ సినిమా ‘అణ్ణ తంగి’ కి రీమేక్ వెర్షన్. యస్.ఏ రాజ్ కుమార్ సంగీత సారధ్యంలోని పాటలు ఎంతగానో అలరిస్తాయి.