పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రెండో సినిమా ‘గోకులంలో సీత’. మొదటి సినిమా కేవలం ఆయన ఎంట్రీ కి ఉపయోగపడినా.. ఈ సినిమా మాత్రం ఆయన పెర్ఫార్మెన్స్ రేంజ్ ఏంటో చెప్పింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బి.శ్రీనివాసరాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా .. 1997లో విడుదలైంది. రాశి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. కోట శ్రీనివాసరావు, శ్రీహరి, హరీశ్, అచ్యుత్, సుధాకర్, మల్లికార్జునరావు, ఆలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. అలాగే. కళ్యాణ్ అనే ఆయన పేరుకి ముందు పవన్ అనే బిరుదును తెచ్చిపెట్టింది. నిజానికి ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టైన ‘గోకులత్తిల్ సీతై’ సినిమాకి రీమేక్ వెర్షన్. కార్తిక్, సువలక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా మంచి హిట్టైంది. కోటి సంగీత సారధ్యంలోని పాటలు ఎంతగానో అలరిస్తాయి.
కల్యాణ్ (పవన్ ) ధనవంతుడైన ముద్దు కృష్ణయ్య (కోట) కొడుకు. అతనికి చిన్నతనంలోనే తల్లి చనిపోయి ఉంటుంది. తండ్రి గారాబంతో, నిర్లక్ష్యంతో విలాసాలకు అలవాటు పడతాడు. ముఖ్యంగా అమ్మాయిలను లొంగదీసుకోవడమంటే అతనికి సరదా. అతని కంపెనీలో పనిచేసే భాస్కర్ (హరీష్ ) శిరీష (రాశి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. శిరీషకు వేరే పెళ్ళి జరగబోతుంటే భాస్కర్ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. కల్యాణ్ అతన్ని ఆపి శిరీషను దొంగతనంగా తీసుకొచ్చేస్తాడు. తీరా శిరీషను తీసుకొచ్చేసరికి భాస్కర్ తండ్రి అందుకు ఒప్పుకోడు. పైగా శిరీష శీలాన్ని శంకిస్తాడు. దిక్కు తెలియని శిరీష ఎక్కడికి వెళ్ళాలో తెలీక బాధపడుతుండే కల్యాణ్ తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. కల్యాణ్ ప్రవర్తన గురించి తెలిసిన అతని స్నేహితులు కొంతమంది ఇద్దరి గురించి చెడుగా మాట్లాడుకుంటారు. కానీ శిరీష దాని గురించి బాధపడవద్దని నచ్చజెప్పి అతని ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. కల్యాణ్ శిరీషను పెళ్ళి చేసుకుంటానని తండ్రిని అడుగుతాడు. ముద్దుకృష్ణయ్య శిరీషను డాక్టర్ తీసుకువెళ్ళి కన్యత్వ పరీక్ష చేయడానికి సిద్ధ పడతాడు. శిరీష మనసు విరిగిపోయి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతుంది. కల్యాణ్ తన తండ్రి చేసిన తప్పు తెలుసుకుని శిరీషను క్షమాపణ వేడుకోవాలని వెళతాడు. కానీ ఆమె అతనితో మాట్లాడదు. దాంతో కల్యాణ్ ఆమె ఇంటి ముందే ఆమరణ నిరాహారదీక్ష చేపడతాడు. ఈలోపు ఇంట్లో వాళ్ళు ఆమెకు బలవంతంగా పెళ్ళి చేయడానికి ప్రయత్నిస్తారు. శిరీష కోరిక మేరకు కల్యాణ్ ఆ పెళ్ళిని ఆపి ఆమెను పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.