గురువు కు తగ్గ శిష్యుడు. గురువులాంటి శిష్యుడు. గురువు సిద్ధాంతాలకు , ఆయన చేసే వివాదాలకు వారసుడు లాంటి శిష్యుడు. నిలువునా టాలెంట్ నింపుకొని .. వివిధ శాఖల్లో పట్టుసాధించి.. గురువునే మించిన ఆ శిష్యుడు జెడీ చక్రవర్తి.  వైవిధ్యతకే అతడు చక్రవర్తి. టాలీవుడ్ లోకి శివ చిత్రంతో అడుగుపెట్టి..  కొన్నాళ్లు ప్రతినాయకుడిగా… సహనటుడిగా కొనసాగిన జేడీ ‘వన్‌ బై టు’, ‘మనీ మనీ’, ‘గులాబీ’ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

‘మృగం’, ‘దెయ్యం’, ‘బొంబాయి ప్రియుడు’, ‘ఎగిరే పావురమా’ చిత్రాలతో జేడీ పేరు మార్మోగిపోయింది. తెలుగులో పలువురు అగ్ర దర్శకులతో వరుసగా సినిమాలు చేశాడు. రామ్‌గోపాల్‌ దర్శకత్వం వహించిన ‘అనగనగా ఒక రోజు’తో మరో విజయాన్ని అందుకొన్నాడు. 1998లో వర్మ ‘సత్య’తో మరోసారి హిందీలో మెరిశాడు జేడీ. ఆ తరువాత మళ్లీ తెలుగులో అవకాశాలు అందుకున్నాడు. ‘నేను ప్రేమిస్తున్నాను’, ‘ప్రేమకు వేళాయెరా’, ‘హరిశ్చంద్ర’, ‘పాపే నా ప్రాణం’, ‘కోదండరాముడు’, ‘నవ్వుతూ బతకాలిరా’, ‘మా పెళ్లికి రండి’, ‘ప్రేమకుస్వాగతం’… తదితర చిత్రాలు చేసిన ఆయన ‘దర్వాజా బంద్‌ రఖో’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ‘హోమం’, ‘సిద్ధం’, ‘మనీ మనీ మోర్‌ మనీ’ చిత్రాలతో తెలుగులోనూ దర్శకత్వం చేసినా.. విజయం మాత్రం దక్కలేదు. నాగచైతన్య కథానాయకుడిగా పరిచయమైన ‘జోష్‌’ నుంచి, మళ్లీ ప్రతినాయక పాత్రలవైపు దృష్టి సారించాడు. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల నుంచి కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, సహనటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా… ఇలా పలు విభాగాల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు  జేడీ చక్రవర్తి.  నేడు జేడీ చక్రవర్తి పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే జెడీ చక్రవర్తి

 

Leave a comment

error: Content is protected !!