పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ‘గబ్బర్ సింగ్’ ఒకటి. తిక్క పోలీసాఫీసర్ గా పవన్ నటన అభిమానుల్ని ఉర్రూతలూగించింది. పరమేశ్వరా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్లగణేష్ నిర్మాణంలో, హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా 2012, మే 11న విడుదలై ఘన విజయం సాధించింది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. అభియన్యు సింగ్, అజయ్ , నాగినీడు, సుభాషిణి, రావు రమేశ్ , కోట శ్రీనివాసరావు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
చిన్నతనం నుంచి షోలే విలన్ గబ్బర్ సింగ్ మీద అభిమానం పెంచుకున్న వెంకటరత్నం నాయుడు.. తన సవతి తండ్రి కారణంగా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఒకాయన సంరక్షణలో పెరిగి పెద్దవాడై.. పోలీసాఫీసరై.. గబ్బర్ సింగ్ గా పేరు మార్చుకుంటాడు. మొదటిసారిగా ఒక గ్రామం స్టేషన్ కు పోలీసాఫీసర్ గా వచ్చి.. దానికి గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ అని పేరు పెడతాడు. తన తిక్క మనస్తత్వంతో కొందరికి విరోధిగా మారతాడు గబ్బర్ సింగ్. ఆ క్రమంలో అతడు సిద్ధప్పనాయుడు అనే ఒక రౌడీకి ఎదురెళతాడు. గబ్బర్ సింగ్ తమ్ముడు అజయ్ ను సిద్ధప్ప పావులా వాడుకొని .. అన్ననే చంపిరమ్మని పంపుతాడు సిద్ధప్ప..తన తల్లిని చంపింది సిద్ధప్పే అని తెలుసుకొన్న అజయ్.. అన్నతో చేతులు కలిపి సిద్ధప్పను తుదముట్టించడమే మిగతా కథ. నిజానికి ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ దబాంగ్ కు రీమేక్ వెర్షన్. హరీశ్ శంకర్ ఆ సినిమా స్టోరీ లైన్ ను మాత్రమే తీసుకొని .. తనదైన స్టైల్లో సినిమాను జనరంజకంగా తీర్చిదిద్దాడు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలోని మొత్తం పాటలు అభిమానుల్ని ఉర్రూతలూగించాయి.