నటభూషణ శోభన్ బాబు నటించిన యాక్షన్ చిత్రాల్లో ‘ఖైదీ కాళిదాసు’ చాలా ప్రత్యేకం. వై.యల్.యన్. పిక్చర్స్ పతాకంపై .. వి.యస్. నరసింహారెడ్డి నిర్మాణ సారధ్యంలో పి.సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. శోభన్ బాబు పోలీస్ గానూ, ఖైదీ గానూ ద్విపాత్రాభినయం చేశారు. దీప కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. కైకాల సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, చంద్రమోహన్ , మోహన్ బాబు, జయమాలిని, త్యాగరాజు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
విజయభాస్కర్ చాలా నిజాయితీ పరుడైన పోలీసాఫీసర్. జగధీష్ చంద్రప్రసాద్ పెద్దమనిషిగా ఉంటూనే లయన్ అనే పేరుతో స్మగ్లింగ్ కార్యకలపాలు, సంఘవిద్రోహ చర్యలు చేస్తుంటాడు. అతడ్ని పట్టుకోడానికి విజయ్ ను పోలీస్ డిపార్ట్ మెంట్ నియమిస్తుంది. అతడి ఆచూకీ తెలుసుకొనే క్రమంలో అతడు మరణిస్తాడు. అతడి ప్లేస్ లోకి అదే పోలికలతో ఉన్న ఖైదీ కాళిదాసు ను పోలీస్ లు నియమించి.. లయన్ ఆటకట్టించడమే ఈ సినిమా మిగతా కథ. నిజానికి ఈ సినిమా కాళిచరణ్ హిందీ సినిమాకి రీమేక్ వెర్షన్. శత్రుఘ్న సిన్హా హీరోగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్టైంది. ఆ తర్వాత మలయాళంలో మోహన్ లాల్ హీరోగా పత్తాముదయంగానూ రీమేక్ అయింది. ఇదే స్టోరీ లైన్ తో రాజమౌళి రవితేజ తో విక్రమార్కుడుగా తీసి సూపర్ హిట్ కొట్టాడు.