ఇటు కామెడీ, అటు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తీయడంలో ఆయన నేర్పరి. అది యాక్షన్ సినిమా అయినా.. అందులో ఆయన కామెడీ సిగ్నేచర్ ఉండాల్సిందే. టాలీవుడ్ లో ఉన్న అందరు కమెడియన్స్.. ఆయన సినిమాల్లో ఖచ్చితంగా ఉండితీరాలి. ఆయన పేరు శ్రీను వైట్ల.

సినిమాలపై ప్రేమతో మద్రాసు వెళ్లారు. సహాయ దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన శ్రీను వైట్ల 1999లో ‘నీకోసం’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత, ఉషాకిరణ్‌ మూవీస్‌లో ‘ఆనందం’ తెరకెక్కించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో శ్రీను వైట్ల పేరు మార్మోగిపోయింది. కామెడీపై పట్టున్న దర్శకుడనే పేరు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత ‘సొంతం’, ‘ఆనందమానందమాయే’, ‘వెంకీ’, ‘అందరివాడు’, ‘ఢీ’, ‘దుబాయ్‌ శీను’ తదితర చిత్రాలు చేశారు. అవన్నీ ఒకెత్తైతే, ఆ తర్వాత చేసిన ‘రెడీ’ మరో ఎత్తు. శ్రీను వైట్ల కామెడీ మార్క్‌ ఎంత బలంగా ఉంటుందో ఆ చిత్రంతో మరోమారు రుజువైంది. ఆ తర్వాత మహేష్‌బాబుతో ‘దూకుడు’ తెరకెక్కించి సంచలన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. ఆ చిత్రం పలు రికార్డుల్ని సొంతం చేసుకొంది. వెంకటేష్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన ‘నమో వెంకటేశాయ’, నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కించిన ‘కింగ్‌’, ఎన్టీఆర్‌తో తీసిన ‘బాద్‌షా’ చిత్రాలు శ్రీను వైట్లకి మంచి పేరు తీసుకొచ్చాయి. ‘ఆగడు’ నుంచి ఆయనకి పరాజయాలు ఎదురయ్యాయి. ‘బ్రూస్‌లీ’, ‘మిస్టర్‌’ తదితర చిత్రాలు నిరాశకు గురిచేశాయి. విజయమే లక్ష్యంగా రవితేజతో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాన్ని తెరకెక్కించారు. జంధ్యాల, ఈవీవీ తర్వాత కామెడీ పరంగా అంత ప్రభావం చూపించిన ఘనత శ్రీనువైట్లకే దక్కుతుంది. నేడు శ్రీను వైట్ల పుట్టినరోజు. ఈ సంద్బంగా ఆయనకి శుభకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!