భారీ తనానికి పెట్టింది పేరు. భోళా తనానికి చిరునామా. మంచి తనానికి నిర్వచనం. భక్తి భావంలో సాటిలేని మేటి. ఆయన పేరు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి. అందరూ షార్ట్ కట్ లో టీయస్సార్ అంటారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి..  ముఖ్యంగా  వైవిధ్యమైన సినిమాలు తీసిన నిర్మాత. ఒకప్పటి ప్రముఖ హాస్యనటుడు రమణారెడ్డి.. ఈయనకి స్వయానా చిన్నాన్న.

నెల్లూరు జిల్లా అల్లూరు లో జన్మించిన టి.సుబ్బిరామిరెడ్డి.. 13 ఏళ్ళ వయసులోనే వ్యాపారరంగంలోకి ప్రవేశించారు. పవర్ ప్రాజెక్టులు, హోటళ్ళు, టౌన్ షిప్పులు .. ఇలా వివిధరంగాల్లో ఆయనకి వ్యాపారాలున్నాయి. హైద్రాబాద్ లో మహేశ్వరి పరమేశ్వరి జంట థియేటర్స్ ఈయనవే. రెండు సార్లు విశాఖ పట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత  గనుల శాఖా మంత్రిగానూ పనిచేశారు.

టీయస్సార్.. ‘జీవనపోరాటం, స్టేట్ రౌడీ, గ్యాంగ్ మాస్టర్, సూర్య ఐపీయస్’ లాంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. అలాగే.. చాందిని, దిల్ వాలా, లమ్హే, వివేకానంద లాంటి హిందీ సినిమాలు,  భగవద్గీత సంస్కృత చిత్రాన్ని నిర్మించి మంచి నిర్మాత గా పేరు తెచ్చుకున్నారు.  నేడు టీయస్సార్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!