ఎర్లియర్ గా ‘రూలర్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశారు నందమూరి బాలకృష్ణ. అయినా సరే దాన్నేమాత్రం పట్టించుకోకుండా.. తన 106వ చిత్రం మీదే పూర్తి గా దృష్టి సారిస్తున్నారు. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీంద్రరెడ్డి నిర్మిస్తోన్న ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ఫష్ట్ షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ను ఏప్రిల్ లో మొదలు పెట్టాలనుకున్నారు.
అయితే .. కరోనా వైరస్ కారణంగా టాలీవుడ్ లో పలు చిత్రాల షూటింగ్స్ ను నిలిపివేస్తున్నారు. ఆ నేపథ్యంలో బాలయ్య, బోయపాటి చిత్రం కూడా షూట్ ను కొద్దిరోజులు వాయిదా వేసుకోనుంది. ఒక కలర్ ఫుల్ సాంగ్ తో సెకండ్ షెడ్యూల్ను ఫ్రెష్ గా మొదలు పెట్టాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఎన్నిరోజులు కరోనా ఔట్ బ్రేక్ ఉంటుందో తెలియదు. ఆ తర్వాతే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కు వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. ‘సింహ, లెజెండ్’ చిత్రాల తర్వాత హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.