చిత్రం : ఓ పిట్టకథ
నటీనటులు : విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
కథ స్ర్కీన్ ప్లే దర్శకత్వం : చెందు ముద్దు
విడుదల తేదీ : మార్చ్ 6, 2020
సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు ను టాలీవుడ్ కు హీరో గా పరిచయం చేస్తూ.. చెందు ముద్దు మలిచిన లవ్ థ్రిల్లర్ ‘ఓ పిట్టకథ’ . ‘మనమంతా’ ఫేమ్ విశ్వంత్ కూడా మరో ముఖ్యపాత్రను పోషించిన ఈ మూవీతో నిత్యాశెట్టి అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయం అయింది. బ్రహ్మాజీ తన పలుకుబడిని అంతటినీ ఉపయోగించి.. విడుదలకు ముందే సినిమాకి మంచి పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేయగలిగాడు. ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడం ఈ సినిమా బాగా కలిసి వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుంది? అసలు దీనికి మంచి ఓపెనింగ్స్ తెచ్చిపెట్టే దమ్ముందా ? చూద్దాం.
కథ :
కథానాయిక వెంకటలక్ష్మి (నిత్యాశెట్టి ) ఓపెనింగ్ సీన్ లోనే కిడ్నాప్ అవుతుంది. ఆమె తండ్రి, బావ (విశ్వంత్ ) పోలీస్ స్టేషన్ కొచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఆ క్రమంలో ఇన్స్ పెక్టర్ (బ్రహ్మాజీ ) కు తన ప్రేమ కథ వివరిస్తాడు. వెళ్తూ వెళ్తూ తనకి ప్రభు (సంజయ్ రావు ) మీద అనుమానంగా ఉందనే విషయం రివీల్ చేసి దానికి కారణం వివరిస్తాడు. ప్రభు ను అరెస్ట్ చేసి స్టేషన్ లో వేసిన తర్వాత వెంకటలక్ష్మిని అతడు కూడా ప్రేమిస్తున్నాడనే విషయం వెల్లడవుతుంది. అంతేకాదు వెంకట లక్ష్మికూడా అతడ్ని ప్రేమిస్తోందన్నవిషయం కూడా తెలుసుకుంటాడు. ఇంతకీ ఇద్దరిలో వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేసింది ఎవరు? దాని వల్ల ఎవరికి లాభం? తెలియాలంటే.. ‘ఓ పిట్టకథ’ సినిమా చూడాల్సిందే.
కథనం విశ్లేషణ :
పేరుకు తగ్గట్టే ‘ఓ పిట్టకథ’ అతి చిన్నకథ. కానీ ఆ కథలోనే బోలెడన్నిట్విస్టులతో, సడెన్ సర్ ప్రైజులతో పకబడ్బందీగా స్ర్కీన్ ప్లే రాసుకొని రెండున్నర గంటల పాటు ప్రేక్షకులకు వినోదం అందించడమే పనిగా పెట్టుకున్నాడు దర్శకుడు చెందు ముద్దు. ఆ ప్రయత్నంలో దాదాపు మూడొంతులు సక్సెస్ అయ్యాడు. ఓపెనింగ్ ఓపెనింగే థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో టేకాఫ్ తీసుకున్న సినిమా.. ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ మొదలవడంతో ఇది సాధారణ ప్రేమకథే అనిపిస్తుంది. కానీ రాను రాను కథని కొన్ని ట్విస్టులతో లాక్ చేసి.. కథనాన్ని ఊహించని రీతిలో పరుగులు తీయిస్తాడు దర్శకుడు. కట్ చేస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర రెండు ట్విస్టుల్ని ఒకేసారి ఇచ్చి.. సెకండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచాడు.
ఇక సెకండాఫ్ లో సినిమా అయితే.. ప్రేక్షకుల్ని చాలా ఇంట్రెస్టింగ్ గా కూర్చోబెడుతుంది. అన్ ప్రెడిక్టబుల్ సీన్స్ తో అటు కామెడీని, ఇటు థ్రిల్లింగ్ ను అందించి.. ఒకో ముడి చిక్కు విడుతూ.. ఎవరూ ఊహించని విధంగా సరికొత్త మలుపుతో క్లైమాక్స్ కు చేరుకుంటుంది. అది కూడా వినోదాత్మకంగా ఉంటుంది. టోటల్ గా ‘ఓ పిట్ట కథ’ చిత్రం చాలా వైవిధ్యమైన వినోదాత్మక థ్రిల్లర్ గా ఓ కొత్త జోనర్లో వేయదగ్గ సినిమా. అందమైన ప్రేమకథతో పాటు.. చక్కటి వినోదం.. అంతకు మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి బలంగా నిలిచాయి. సో.. ఈ సినిమా వర్త్ వాచ్ అని ..యూత్ కు నచ్చే లవ్ స్టోరీ అని చెప్పుకుతీరాలి.
నటీనటుల పెర్ఫార్మెన్స్ :
బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు .. తొలి చిత్రమైనా .. హీరోగా తనదైన స్థాయిలో మెప్పించి.. ప్రభు పాత్రను బాగా రక్తి కట్టించాడు. కానీ కొన్ని ఎక్స్ ప్రెషన్స్ పలికించడంలో కాస్తంత శ్రద్ధపెట్టాలి. మరో హీరో విశ్వంత్ తన పాత్రల్లో వేరియేషన్స్ ను బాగా క్యారీ చేశాడు. కొత్త అమ్మాయి నిత్యా శెట్టి చాలా క్యూట్ గా హావభావాలు పలికిస్తూ.. బాగా నటించింది. అలాగే ఇన్స్ పెక్టర్ గా బ్రహ్మాజీ తనదై స్థాయిలో ఆ పాత్రను చేసుకుంటూ పోయాడు. ఇక కథానాయిక తండ్రి పాత్ర కూడా బాగా పేలుతుంది సినిమాలో. ఇక ఇందులో చెప్పుకోదగ్గ మరో పాత్ర సంజయ్ రావు ఫ్రెండ్ గా పండు పాత్ర చేసిన కుర్రోడిది. కామెడీ అద్భుతంగా పండించాడు. అతడిలో మంచి కమెడీయన్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
సాంకేతిక నిపుణులు :
సంగీతం ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ప్రవీణ్ లక్కరాజు అందించిన పాటలు కానీ నేపధ్య సంగీతం కానీ సినిమాను ఉన్నతంగా నిలిపాయి. సంగీతం తర్వాత విశేషంగా ఆకట్టుకునేది సినిమాటోగ్రఫీ. ఓ పిట్ట కథలో విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ బానే ఉంది. అయితే సినిమా బాగా స్లో గా ఉండటం మెయిన్ కంప్లైంట్. డైలాగ్స్ ఒకో చోట బాగా పేలాయి. స్క్రీన్ ప్లే పరంగా మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. చందు ముద్దు దర్శకత్వం పరంగా మంచి మార్కులే వేయించుకుంటాడు.
మొత్తం మీద ‘ఓ ఫిట్టకథ’ చిత్రం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ట్విస్టుల ఎపెక్ట్స్ తో ప్రేక్షకులకు మంచి అనుభూతినే ఇస్తుంది.
రేటింగ్ : 3.5
బోటమ్ లైన్ : ‘పిట్ట’ కొంచెం కూత ఘనం
Review by : రామకృష్ణ క్రొవ్విడి