ఆయన పాట ఒకప్పుడు తెలుగు శ్రోతలకు వేణుగానమై వినిపించింది. ఆయన గాత్రం తెలుగు తెరపై ఆనంద గీతమై నర్తించింది. శ్రావ్యత, శ్రుతి పక్వత, రాగతాళ లయాన్విత శోభ చేకూర్చిన  ఆ గొంతు మరెవరిదో కాదు .జి.ఆనంద్ ది. తెలుగు తెరపై గాయకుడిగా, సంగీత దర్వకుడిగా ఒకప్పుడు ఒక వెలుగువెలిగిన ఆయన .. దాదాపు 2500 లకు పైగానే పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల్ని ఓలలాడించారు.  అమెరికా అమ్మాయిలో ఒక వేణువు వినిపించెను, కల్పన లో దిక్కులు చూడకు రామయ్య , చక్రధారిలో విఠలా విఠలా , మనవూరి పాండవులు లో నల్లనల్లని మబ్బుల్లోనా లగ్గోపిల్లా లాంటి ఎన్నో సుమధురమైన పాటలు పాడారు.

ఎందరో గాయనీ గాయకులను తెలుగు తెరకు పరిచయం చేశారు ఆనంద్. దాదాపు ఏడు వేలకు పైగా ఇతర దేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. దీంతో  కొన్ని సినిమాలకు పాటలు పాడే అవకాశాన్ని కోల్పోయారు. అంతే కాకుండా దాదాపు కొన్నేళ్లుగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ తదితర భాషల్లో టాప్ పొజిషన్ లో ఉన్నారు ఎస్.పి. బాలసుబ్రమణ్యం. అలాంటి ఆయనను దాటుకుని పాటలు రావడం ఆయన  అదృష్టమని చెప్పాలి.

షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం, తదితర సీరియల్స్ కు మ్యూజిక్ అందించారు. ఆయన ప్రస్తుతం  భక్తి పాటలతో ఆల్బమ్స్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. జి.ఆనంద్ ‘స్వాతంత్ర్యానికి ఊపిరి పొయ్యండి, రంగవల్లి, గాంధీనగర్ రెండవవీధి’లాంటి  సినిమాలకు సంగీతం అందించారు. ఇప్పటికీ సంగీతం మీదున్న మక్కువ ఆయనను ఒక చోట ఉండనీయడం లేదు. గాయనీ గాయకులకు మెళకువలు చెబుతున్నారు. నేడు జి.ఆనంద్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆ మధురగాయకుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్ .

Leave a comment

error: Content is protected !!