విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ తో అనిల్ రావిపూడి మలిచిన కామెడీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్ 2’ . లాస్టియర్ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కు కాసుల వర్షం కురిపించింది. అందుకే సక్సెస్ సెలబ్రేషన్స్ రోజే ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు. ‘ఎఫ్3’ టైటిల్ తో సీక్వెల్ ఉండనుందని ఆ రోజే హింట్ ఇచ్చారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ తో పాటు మరో పదం కూడా ట్యాగ్ లైన్ లో యాడ్ అవనుందని అర్దమవుతోంది. అయితే ఆ పదానికి సరిపడే హీరో ఎవరై ఉంటారని అప్పట్లో అందరూ అనుకున్నారు. దానికి ఇప్పుడు సమాధానం దొరికింది.
‘ఎఫ్3’ మూవీలో వెంకీ, వరుణ్ తేజ లతో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటించనున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. అసలే రవితేజ కామెడీ పండించడంలోనూ , వెటకారంగా పంచులు పేల్చడంలోనూ మాస్టర్ . అలాంటి హీరో.. వెంకీ, వరుణ్ తేజలతో కలిస్తే.. ఆ మూవీ కామెడీకా బాప్ అవుతుందని వేరే చెప్పాలా? ప్రస్తుతం అనిల్ ఈ మూవీ స్ర్కిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడని, వెంకీ, వరుణ్ లతో పాటు రవితేజ కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ తో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నఅనిల్ రావిపూడి .. మరింత ఉత్సాహంగా ‘ఎఫ్3’ కు కథ రెడీ చేస్తున్నాడు. ‘రాజాది గ్రేట్’ తర్వాత అనిల్ , రవితేజ కలయికలో వస్తూండడంతో ‘ఎఫ్ 3’పై భారీ అంచనాలున్నాయి. మరి ఈ సారి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్ లో నవ్వులు పండిస్తాయో చూడాలి.