ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. మన దేశంలో రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. దానికి ఒకటే మార్గం. వీలైనంత వరకూ ఇంట్లోనే గడపడం. లాక్ డౌన్ ను వంద శాతం పాటించడం. అలా ఇంటికే పరిమితమైన వాళ్ళలో రోజు కూలీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన రోజు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారిని, సాధారణ ప్రజల్ని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
అయితే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మాత్రం అంతకు మించి అనే స్థాయిలో కరోనా పై యుద్ధానికి సిద్ధమైంది. విలక్షణ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు ఏకమై.. ఎనిమిది గ్రామాల్ని దత్తత తీసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల్లోని పేద ప్రజలకు రోజుకు రెండు పూటలా ఆహారం సరఫరా చేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసే వరకూ ఇలా రోజూ ఆహారం పంపిణీ చేయబోతున్నారు. ఇది కాకుండా రోజుకు ఎనిమిది టన్నుల కూరగాయల్ని సరఫరా చేస్తున్నారు. దీంతో నెజిజన్లు వారిద్దరినీ ప్రశంసలతో ముంచెత్తతున్నారు.