ఆయన కుడిచేయి లేపి.. ఎడమకాలు కదిపితే నృత్య ప్రకంపన. బాడీ షేక్ చేస్తూ.. అవయవాలన్నీ బ్రేక్ చేస్తే డ్యాన్సింగ్ సెన్సేషన్. స్ర్పింగ్ ఏదో మింగినట్టు .. కాళ్ళకింద భూమేదో కుంగినట్టు … ఆయన వేసే మాసీ స్టెప్స్ కు దుమ్మురేగిపోవాల్సిందే. పేరు ప్రభుదేవా .. మారు పేరు ఇండియన్ మైకేల్ జాక్సన్. తండ్రి సుందరం మాస్టారు కొరియో గ్రఫీని చిన్నప్పటినుంచీ దగ్గర నుండి చూస్తూ.. ఆయన డ్యాన్స్ కు , డ్యాన్సింగ్ మూమెంట్స్ కు తనకు తెలియకుండానే అభిమానిగా మారిపోయిన ప్రభుదేవా.. దాన్నే తన నరనరాన జీర్ణించుకొని విపరీతమైన సాధన చేసి .. తండ్రిని మించిన డ్యాన్సర్ గా ఎదిగాడు.  అతడ్ని  మెగాస్టార్ చిరంజీవి ‘రాజా విక్రమార్క’ చిత్రం నుంచి కొరియోగ్రాఫర్ గా సౌత్ కు పరిచయం చేశారు. గగన కిరణ గమనమిది పాటతో తన కొరియోగ్రఫీ సత్తా ఏపాటిదో చూపించిన ప్రభుదేవా అక్కడనుంచి .. నెం.1 కొరియో గ్రాఫర్ గానూ, హీరోగానూ, ఆపై దర్శకుడిగానూ, నిర్మాతగానూ వివిధ రకాల భూమికలు పోషిస్తూ.. ఇప్పటికీ డ్యాన్సింగ్ సెన్సేషన్ గానే కొనసాగుతున్నాడు. నువ్వొస్తానంటే వద్దంటానా చిత్రంతో డైరెక్టరైన ప్రభుదేవా..ఆ తర్వాత తెలుగులో పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు దర్శకత్వం వహించి..ఆపై బాలీవుడ్ లోకి వాంటెడ్ మూవీతో దర్శకుడయ్యాడు.

బాలీవుడ్‌లోనూ సల్మాన్‌ఖాన్, అజయ్‌ దేవగణ్, అక్షయ్‌కుమార్‌ వంటి అగ్ర నటుల చిత్రాలకి దర్శకత్వం వహించాడు. గత ఏడాది సల్మాన్‌తో ‘దబాంగ్‌ 3’ని తెరకెక్కించారు. ప్రభుదేవా వృత్తి పరమైన విషయాలతోనే కాకుండా… వ్యక్తిగత జీవితం పరంగా కూడా పలుమార్లు వార్తల్లోకెక్కాడు. రామలతని వివాహం చేసుకున్న ఆయన 2010లో ఆమె నుంచి విడిపోయాడు. కథానాయిక నయనతారతో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకొన్నారు కానీ.. నాæకీయ పరిణామల మధ్య 2012లో ఈ ఇద్దరూ విడిపోయారు. ప్రభుదేవాకి ఇద్దరు కుమారులున్నారు. ఆయన తమ్ముళ్లు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్‌… ఇద్దరూ కూడా నటులుగా, నృత్య దర్శకులుగా రాణిస్తున్నారు. దక్షిణాదిలో ప్రయాణం మొదలుపెట్టి… బాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న ప్రభుదేవా పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆ ఇండియన్ మైకేల్ జాక్సన్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే ప్రభుదేవా

Leave a comment

error: Content is protected !!