విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా.యన్టీఆర్ నటించిన సూపర్ హిట్ లవ్ స్టోరీ  ‘ఆరాధన’. 1976 లో విడుదలైన ఈ సినిమా.. శ్రీభాస్కర చిత్ర బ్యానర్ పై .. పుండరీకాక్షయ్య నిర్మాణ సారధ్యంలో బి.వి.ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా ఘన విజయం సాధించింది. వాణీశ్రీ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. జగ్గయ్య, గుమ్మడి , ప్రభాకరరెడ్డి, మాడా వెంకటేశ్వరరావు, సాక్షిరంగారావు, రాజనాల, కె.వి.చలం ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సాలూరి హనుమంతరావు సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు  ఎవర్ గ్రీన్ హిట్స్. ముఖ్యంగా మహమ్మద్ రఫీ పాడిన నా మదినిన్ను పిలచింది గానమై పాటైతే.. అద్భుతం.

గోపి (ఎన్ ‌టి రామారావు) మేకలను పెంచుకొంటూ చెల్లెలు జానకి (విజయ లలిత) తో జీవిస్తుంటాడు. ఒకసారి ప్రముఖ గాయని రాధ (వాణిశ్రీ) ఆ ప్రాంతానికి వస్తుంది. గోపీ కి సహజంగా ఏర్పడిన ప్రతిభతో వేణునాదం చేయడం చూసి అతనితో ప్రేమలో పడుతుంది. రాధ బయలుదేరే ముందు గోపిని తనతో పాటు రమ్మని అడుగుతుంది. తద్వారా అతని ప్రతిభ వృద్ధి చెంది డబ్బు కూడా సంపాదించవచ్చు అని చెబుతుంది. కానీ సంగీతం దేవుడిచ్చిన వరం అని గోపి చెప్తాడు. దానిని అమ్మేందుకు ఇష్టపడడు. కాబట్టి, రాధ తనతో పాటు గ్రామంలో స్థిరపడాలని నిర్ణయించుకుంటుంది. తరువాత ఆమె తిరిగి వచ్చి తన కంపెనీ యజమాని అయిన సుధాకర్ (జగ్గయ్య) కు ఈ ప్రేమ వ్యవహారమంతా వివరిస్తూ, తనకు ఇంతకు పూర్వం సుధాకర్ ను వివాహం చేసుకుంటాననే ఉద్దేశ్యాన్ని వ్యతిరేకిస్తుంది. ఇంతలో గోపీ చెల్లెలిపెళ్ళి  నిర్ణయిస్తాడు కానీ రద్దు అవుతుంది. అప్పుడు గోపి డబ్బు సంపాదించాలని నిర్ణయిస్తాడు, అందుకే అతను రాధ సహాయం కోసం నగరానికి చేరుకుంటాడు. తరువాత పెద్ద స్టార్ అవుతాడు. చాలా డబ్బు సంపాదించి జానకి వివాహం చేస్తాడు. ఇప్పుడు గోపి, రాధ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు. రాధ తండ్రి దశరథరామయ్య (గుమ్మడి) కూడా దీనికి అంగీకరిస్తాడు. కానీ గోపీని చంపడానికి సుధాకర్ కుట్ర పన్నినప్పుడు జరిగిన ప్రమాదంలో గోపీ మూగవాడవుతాడు. చివరికి అతడికి మాట వస్తుందా రాదా అన్నదే మిగతా కథ. నిజానికి ఈ సినిమా ‘గీత్’ బాలీవుడ్ మూవీకి రీమేక్ వెర్షన్. రాజేంద్రకుమార్, మాలా సిన్హా జంటగా నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

Leave a comment

error: Content is protected !!