ఆయనకి సినిమా అంటే పేషన్.. సినిమా అంటే పిచ్చి. సినిమానే తింటాడు. సినిమానే తాగుతాడు. సినిమానే శ్వాసగా తీసుకుంటాడు.  సినిమా అనే మూడక్షరాలతోనే ఎప్పుడూ సహజీవనం చేస్తాడు. విద్యాధికుడు. విషయ పరిజ్నానం ఎక్కువ. గొప్ప కథకుడు. అంతకు మించిన భావకుడు. ముక్కుకు సూటిగా పోయే మనస్తత్వం, తను నమ్మిన దానికే కట్టుబడి ఉండే నిజాయితీ పరుడు. ఒక కథను సినిమాగా ఎలా తెరకెక్కించాలి? అనుకున్న పాయింట్ ను నేరుగా ప్రేక్షకుల గుండెల్లోకి ఎలా ఇంజెక్ట్ చేయాలి అనే విషయాల్లో ఆయన మాస్టర్. పేరు వాడ్రేవు నాగేంద్ర ఆదిత్య. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనను వి.యన్.ఆదిత్య అని పిలుస్తారు. ఒక స్టోరీ లైన్ ను నిమిషాల్లో కథగా డవలప్ చేయడంలో ఆయన చాలా దిట్ట. అలాగే..  క్షణాల్లో సన్నివేశాలు అల్లేయడంలో కూడా ఆయన చెయి తిరిగిన దర్శకుడు.

రావికొండలరావు సిఫారసుతో బృందావనం సినిమాకి సింగీతం శ్రీనివాస రావు దగ్గర అప్రెంటిస్ గా చేరారు ఆదిత్య. అసిస్టెంట్ డైరెక్టర్గా తెరమీద ఇతడి పేరు పడిన మొదటి సినిమా భైరవద్వీపం. అక్కడినుంచీ ఐదు సంవత్సరాలపాటు వివిధ దర్శకుల వద్ద దర్శకత్వశాఖలో సహాయకుడిగా చేశాడు. కె.ఎస్. సేతుమాధవన్ దగ్గర  కమల్ హసన్ నమ్మవర్ సినిమాకి అసోసియేట్ గానూ , పి.వాసు వద్ద రజనీ కాంత్ ఉలైపాళి కి అప్రెంటిస్ గానూ చేశారు. తరువాత జయంత్ సి.పరాన్జీ దగ్గర  ప్రేమించుకుందాం రా, బావగారూ బాగున్నారా, ప్రేమంటే ఇదేరా సినిమాలకీ పనిచేశారు ఆదిత్య.  ‘మనసంతా నువ్వే’ చిత్రంతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకొని .. తిరుగులేని దర్శకుడిగా ఎదిగారు. ఆ తర్వాత ‘శ్రీరామ్, నేనున్నాను, మనసు మాటవినదు, బాస్, ఆట, రెయిన్ బో, రాజ్, ముగ్గురు’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తన మార్కు చూపించారు. ప్రస్తుతం ‘వాళ్ళిద్దరి మధ్య’ అనే మూవీతో రాబోతున్న ఆయన పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!