ఒకోసారి ప్రముఖ పత్రికలు కూడా పొరపాటు చేస్తుంటాయి. ఒకరి గురించి వార్త అయితే… వేరే వారి ఫోటోలు ప్రచురిస్తుంటాయి. అవి మామూలు వార్తలైతే పర్వాలేదు. అవే మరణించిన వారి గురించి వార్తలైతే..  అది ఎన్ని అనర్ధాలకి దారితీస్తుంది? ఇది సాక్షాత్తూ విజయాధి నేత చక్రపాణి విషయంలోనే జరగడం విడ్డూరం అనిపించకమానదు.

1971లో తన ప్రియ మిత్రుడు కె.వి.రెడ్డి మరణాన్ని పింగళి జీర్ణించుకోలేక మరింత వేదనకు గురయ్యారు. దీంతో ఆయనకి క్షయవ్యాధి సోకింది. అంతకు ముందు వున్న వుబ్బస వ్యాధి తిరగబెట్టి ఆయన  మరణించారు. పింగళి చనిపోయిన వార్తను ఒక ప్రముఖ దినపత్రిక ప్రముఖంగా ప్రకటిస్తూ పొరబాటున పింగళి నాగేంద్రరావు ఫోటోకి బదులుగా చక్రపాణి ఫోటో పెట్టింది. పేపర్ చదివిన సినీ విమర్శకులు భమిడిపాటి రామగోపాలం వెంటనే ఆ పత్రిక కార్యాలయానికి ఫోనుచేసి పత్రికలో దొర్లిన పొరబాటును సంపాదకునికి వివరించారు. సంపాదకుడు విచారం వ్యక్తపరుస్తూ మరుసటి సంచికలో సవరణ ప్రచురిస్తానని, చక్రపాణికి క్షమాపణలు చెబుతానని తెలిపారు. భమిడిపాటికి చక్రపాణి పరిచయం వుండడంతో చనువుకొద్దీ ఈ విషయాన్ని ఆయనకు కూడా చేరవేశారు. దానికి చక్కన్న తనదైన శైలిలో జవాబిస్తూ ‘’ఆళ్లు సరిగ్గానే యేశారులే. ఎందుకంటే ఆడుబోతే నేను పోయినట్టేగా’’ అన్నారు. అదండీ పింగళి, చక్రపాణి మధ్య వున్న అనుబంధం, ఆప్యాయత.

Leave a comment

error: Content is protected !!