మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ బిగిన్ అయినప్పటినుంచీ ఏదో ఒక అప్డేట్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఒక మంచి సామాజిక సందేశంతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖలో నిజాయితీ పరుడైన ఒక ఆఫీసర్ గా వర్క్ చేస్తాడని, అందులో జరిగే అక్రమాల్ని, అవినీతిని అతడు ప్రశ్నిస్తాడని తెలుస్తోంది. అలాగే.. ఈ సినిమాలోనే చిరు నక్సలైట్ గా కూడా కనిపిస్తాడని వార్తలొస్తున్నాయి. ఇంకా ఇందులోని చిరు యంగ్ ఏజ్ పాత్ర లో రామ్ చరణ్ కనిపిస్తాడని నిన్నమొన్నటి వరుకూ వార్తలొచ్చాయి.
అయితే ఆ పాత్రను ఇప్పుడు చెర్రీ చేయడం లేదని .. దాని కోసం మహేశ్ బాబును కొరటాల సీన్ లోకి దింపుతున్నాడనే వార్త గత కొద్ది రోజుల నుంచీ వినిపిస్తోంది. మరి అందులో నిజానిజాలేంటో .. నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించే వరకూ తెలియదు కానీ.. మహేశ్ బాబు మాత్రం ఆ పాత్ర కోసం దాదాపు 30 రోజుల కాల్షీట్స్ ను కొరటాలకు ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. మహేశ్ బాబు, కొరటల కలయికలో గతంలో రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఆ బాండింగ్ తోనే కొరటాల ఆ పాత్ర చేయమని మహేశ్ ను రిక్వెస్ట్ చేయడంతోనూ, అంతేకాక చిరంజీవి పై తనకున్న గౌరవంతోనూ మహేశ్ ఆ పాత్రను చేయడానికి ముందుకొచ్చాడన్నది దాని సారాంశం. మరి చిరు యంగ్ ఏజ్ పాత్రలోకి మహేశ్ బాబు పరకాయ ప్రవేశం చేసేది ఎప్పుడో ?