విలక్షణ నటుడు మోహన్ బాబు సినీ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించుకున్న చిత్రం ‘అసెంబ్లీ రౌడీ’. బి.గోపాల్ దర్శకత్వంలో 1991 లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ లో సంచలన విజయం నమోదు చేసుకుంది. అందాల దివ్యభారతి గ్లామరస్ పెర్ఫార్మెన్స్ , కే.వీ.మహాదేవన్ సంగీత సారధ్యంలోని పాటలు ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రానికి అదనపు ఆకర్షణలు గా నిలిచాయి. శివాజీ అనే ఒక యువకుడు భాషా అనే గూండా వల్ల హత్యానేరం మీద జైలుకు వెళతాడు. అతడు నిర్దోషి అని భావించిన శివాజీ ఊరువాళ్లు .. అతడ్ని జైలునుంచే యం.ఎల్.ఏ గా గెలిపించి.. అతడి నిర్దోషిత్వాన్ని నిరూపిస్తారు. చివరికి శివాజీ భాషా ఆటలు కట్టించి.. యం.ఎల్.ఏ అనే పదానికి సరైన అర్ధం చెప్పడమే ‘అసెంబ్లీ రౌడీ’ చిత్రకథ. నిజానికి ఈ సినిమా 1990 లో తమిళంలో వచ్చిన ‘వేలై కిడైచ్చుడుచ్చు’ మూవీకి రీమేక్ అవడం విశేషం. సత్యరాజ్ , గౌతమీ జంటగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ కూడా విజయ దుందుభి మోగించింది. అలాగే ఇదే సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా ‘రౌడీ అండ్ ‘యం.ఎల్ .ఏ’ గానూ, బాలీవుడ్ లో అనిల్ కపూర్ హీరోగా ‘లోఫర్’ గానూ, ఒడియాలో ‘కోటి మనిషా గోటీ జగా’ గానూ రీమేక్ అయి.. ఆయా భాషల్లోనూ సంచలన విజయం సాధించింది.