ఆయన పేపర్ మీద పెన్ను పెడితే.. అగ్ని కురవాల్సిందే. అభ్యుదయం రవ్వలు ఎగసి పడాల్సిందే. అన్యాయాన్ని , అక్రమాన్ని ఎలుగెత్తి చాటి.. అన్నార్తులకి బాసటగా నిలిచే ఆయన కలం.. కరుణ రసంతో తడవాల్సిందే. కత్తి కన్నా కలం గొప్పదన్న సిద్ధాంతాన్ని నమ్మి.. తన జీవితమంతా అభ్యుదయ బాటనే పయనించిన ఆయన పేరు యం.వి.యస్ .హరనాథరావు. ఆయన జీవితంలో కమర్షియల్ సినిమాలూ చేశారు. కానీ… ఎంవీఎస్ మార్కు మాత్రం కొరడాలా ఛెళ్లుమనిపించే సంభాషణలే. దాదాపు 150 చిత్రాలకు సంభాషణలు అందించిన హరనాథరావు కలం అందరిలోనూ ఆవేశాన్ని రగిలించి.. ఆలోచనను కలిగించింది.
ప్రజా నాట్యమండలి ప్రభావం హరనాథరావుపై చాలా పడింది. ఆ నాటకాలన్నీ చూసి.. అభ్యుదయ భావాల్ని వంటబట్టించుకొన్నారు. నాటక రచయితగా మారితే… అలాంటి కథలే రాసుకొన్నారు. ఆయన రాసిన తొలి నాటకం ‘రక్తబలి’. ఆ సమయంలో నాటకాలు ఎలా రాయాలన్న విషయంలో తనకు ఎలాంటి అవగాహనా లేదని చెప్పేవారాయన. జగన్నాథ రథ చక్రాలు’ నాటక రచయితగా ఎం.వీ.ఎస్‌ని నిలబెట్టేసింది. ఆ నాటకంలో తండ్రీ కొడుకుల పాత్రలున్నాయి. తండ్రిగా హరనాథరావు నటిస్తే… ఆయన కొడుకు పాత్రలో టి.కృష్ణ కనిపించేవారు. ఆయనే.. ‘నేటి భారతం’ దర్శకుడు. టి.కృష్ణతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ‘రేపటి పౌరులు’ చిత్రానికి సంభాషణలు రాశారు ఎంవీఎస్. తొలి అడుగుతోనే ప్రభంజనం సృష్టించిందీ జంట. ఈ చిత్రంలో ప్రతీ మాటా తూటాలా పేలుతూ… రచయితగా ఎంవీఎస్ స్థాయి ఏపాటిదో తెలియజెప్పాయి. తొలి అడుగుతోనే నంది అవార్డునీ పట్టేశారు. ఆ తరువాత ‘భరతనారి’, ‘ఇదా ప్రపంచం’, ‘అమ్మాయి కాపురం’, ‘అన్న’ చిత్రాలకు నందుల్ని అందుకొన్నారు. టి.కృష్ణ ఆరు చిత్రాలకు దర్శకత్వం వహిస్తే, అందులో ఐదింటికి మాటలు రాశారు హరనాథరావు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన సినిమాలకూ పనిచేశారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘సూత్రధారులు’ , స్వయంకృషి సినిమాలు రచయితగా ఎంవీఎస్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. కథకుడిగా తనపై పడిన ముద్రని చెరిపి వేయాలన్న ప్రయత్నమూ చేశారు. మాస్, కమర్షియల్ కథలకు పనిచేయడం మొదలెట్టారు. వాటి ద్వారానూ.. పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొన్నారు. నాటకాలాడిన అనుభవంతో వెండి తెరపై కొన్ని కీలక పాత్రల్లో కనిపించారు. నేడు యం.వి.యస్ హరనాథ రావు వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.